కీర్తన-Keerthana
- -------------------------------------------
keertana(Amruta) - కీర్తన (అమృత)
మణిరత్నం సార్ సినిమాలో నటించడమంటే ఎంత గొప్పో నాకు ఆ వయసులో తెలియలేదు. ఇప్పుడు మాత్రం తలచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను పుట్టిందీ పెరిగిందీ అంతా చెన్నైలోనే. అమ్మ సీత కథానాయిక, నాన్న పార్థిబన్ నటుడు, దర్శకుడు. అమ్మానాన్నల సినిమాలు చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను కనుక నాకు ఆ వాతావరణం కొత్తగా అనిపించేది కాదు. నేను అయిదో తరగతిలో ఉన్నప్పుడు మణిరత్నంగారు ఓసారి మా నాన్న దగ్గరికి వచ్చి 'నా కథలో ఓ ముఖ్యమైన పాత్ర ఉంది. దానికి కీర్తన అయితే బాగుంటుంది' అన్నారు. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. అప్పటికే షూటింగులు ఎలా జరుగుతాయో చూశాను కనుక, నటించడానికి నాకేం భయం వేయలేదు. అమ్మ నాకు తోడుగా షూటింగులకు వచ్చేది. నిజానికి నాకు ఎలాంటి శిక్షణను ఇవ్వకుండా కెమెరా ముందు నిల్చోబెట్టారు. అప్పుడప్పుడు చెప్పినట్టు చేయలేక పోయేదాన్ని. దాంతో మణిరత్నం సార్ నాన్నతో 'మీ అమ్మాయిని నటించమని చెప్పకండి.. నిజ జీవితంలో ఎలా ఉంటుందో.. కెమెరా ముందు కూడా అంతే సహజంగా కనిపించాలని చెప్పండి. దానికి ఎలాంటి శిక్షణలూ అవసరం లేదు' అని చెప్పారు. చిత్రీకరణకు ముందే నాన్న చేతికి స్క్రిప్ట్ వచ్చేసేది. ముందురోజే అంతా చదివి వినిపించేవారు. ఇక సెట్స్‌పైకి వెళ్లాక.. ఒకే సన్నివేశాన్ని మూడు, నాలుగు రకాలుగా నటించేదాన్ని. అందులో ఏది బాగుంటే అదే మణిసార్ తీసుకునేవారు. అన్నట్టు అమృతలో నేను అంత బాగా నటించడానికి హీరో సిద్ధార్థ కూడా కారణమే. ఆ సినిమాకి తను సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఒకసారి నేను సరిగా చేయలేకపోవడం గమనించి రోజూ ఉదయాన్నే మా ఇంటికొచ్చి ముందే ఆ రోజు చేయాల్సిన సన్నివేశం గురించి వివరించేవారు. దాంతో షూటింగ్ సమయంలో పని సులువైపోయేది. అమృత నాకెంత గుర్తింపు తెచ్చిపెట్టిందంటే నా అసలు పేరు కీర్తన అని చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ 'అమృత' అనే పిలుస్తారు. అంతేకాదు ఆ పాత్ర నాకు జాతీయస్థాయిలో ఉత్తమ బాలనటిగా అవార్డునీ తెచ్చిపెట్టింది. అమృత తరువాత మళ్లీ ఏ సినిమాలో నటించలేదు. ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఓ జపనీస్ సినిమాలో నటించే అవకాశం దొరికింది. స్క్రిప్ట్ పూర్తిగా చదివా. 'చాలా బాగుంది... కానీ నటించను' అని చెప్పేశా. ఎందుకంటే నటన నా ఇష్టాల జాబితాలో మొదటిది కాదు.
ఇంట్లో నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. సంగీతం నేర్చుకుంటా అనగానే ఏఆర్ రెహ్మాన్ సంగీత కళాశాలలో చేర్చించారు. అదయ్యాక శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నా. చదువును ఏమాత్రం అశ్రద్ధ చేయకుండానే ఇవన్నీ నేర్చుకున్నా. విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసి కొన్ని రోజులు మణిరత్నం సార్ దగ్గరే సహాయ దర్శకురాలిగా పనిచేశా. ఆ తర్వాత దర్శకుడు విష్ణువర్థన్ వద్ద అజిత్ సినిమా కోసం పనిచేశా. ప్రస్తుతం దర్శకత్వశాఖలో రాణించేందుకు మెలకువలు నేర్చుకుంటున్నా. మంచి సినిమాతో దర్శకురాలిగా మీ ముందుకొస్తా.
- ఉదయ్, న్యూస్‌టుడే, చెన్నై
కీర్తన నటించిన తెలుగు చిత్రాలు
- గణేష్
- ==============================
.jpg)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog