Sunday, June 7, 2015

వీళ్లందరిదీ.. ఒకే వూరు!

పరిచయం (Introduction) :

వీళ్లందరిదీ.. ఒకే వూరు! 
అనుష్క... చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ ప్రాధాన్యమున్న పాత్ర చెయ్యాలంటే మొదట వినిపించే పేరు తనదే. ఐశ్వర్యారాయ్‌... భారత దేశం గర్వించదగ్గ అందాల తారల్లో ఆమెది ఓ ప్రత్యేక స్థానం. వీళ్లేకాదు, దీపికా పదుకొణె, పూజాహెగ్డె, జెనీలియా, శిల్పాశెట్టీ... ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రస్థానం. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... వాళ్లందరి సొంతూరు మాత్రం ఒక్కటే. అదే మంగళూరు.

ఐశ్వర్యారాయ్‌... 
ప్రపంచ సుందరిగా ఎంపికై భారత దేశ కీర్తిని పెంచడమే కాకుండా తన ప్రతిభతో బాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది ఐశ్వర్యారాయ్‌. కానీ ఆమె అసలు దక్షిణాది అమ్మాయనే విషయం చాలా మందికి తెలియదు. అవును, తను పుట్టింది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న మంగళూరులో. తండ్రి క్రిష్ణరాజ్‌ రాయ్‌, స్థానిక నౌకాశ్రయంలో మెరైన్‌ ఇంజినీర్‌. తల్లి బృందారాయ్‌ రచయిత. ఆమె పూర్వీకులు తుళు భాషను మాట్లాడే వర్గానికి చెందినవారు. అందుకే, తన మాతృ భాష తుళు అని చెబుతుంది అందాల ఐశ్వర్య. 

అనుష్క... 
చూడ్డానికి పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. నటించే సినిమాలు కూడా ఎక్కువ తెలుగులోనే. కానీ అనుష్క అచ్చంగా మంగళూరమ్మాయి. తల్లిదండ్రులు మంగళూరుకి చెందిన ప్రఫుల్ల, ఏ ఎన్‌ విఠ్ఠల్‌ శెట్టీలు. అనుష్క అసలు పేరు కూడా స్వీటీ శెట్టీనే. బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ చేసిన తర్వాత యోగా టీచర్‌గా మారి సినిమాల్లోకి అడుగు పెట్టింది. అన్నట్లు అనుష్క మాతృభాష కూడా తుళునే. 

పూజా హెగ్డె 
తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. 'ఒక లైలా కోసం', 'ముకుంద' సినిమాలతో తెలుగులో గుర్తింపు పొందింది. ఇప్పుడు బాలీవుడ్‌లో తొలి చిత్రంతోనే హృతిక్‌ రోషన్‌ సరసన ప్రతిష్ఠాత్మక చిత్రం 'మొహంజొదారొ'లో నటిస్తూ బోలెడంత క్రేజ్‌ను సంపాదించేసుకుంది పూజా హెగ్డె. కానీ, తనకిష్టమైన వూరేదంటే మంగళూరూ బెంగళూరూ అని చెబుతుంది ఈ అమ్మడు. ఆమె తల్లిదండ్రులు అక్కడివారే మరి. అందుకే, 'ముంబైలో స్థిరపడినా తీరిక దొరకగానే మంగళూరు, ఉడుపిల్లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చేస్తుంటా' అంటుంది పూజ. 

దీపికా పదుకొణె 
దీపికా పదుకొణె తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రకాశ్‌ పదుకొణె. వీరి పూర్వీకులు మంగళూరుకి దగ్గర్లో ఉన్న పదుకొణె గ్రామం నుంచి వచ్చిన వారట. అందుకే, దీపిక అక్కడకు దగ్గర్లో ఉన్న బెంగళూరులో పెరిగింది. స్థానికంగా ఉన్న సోఫియా హైస్కూల్లోనూ, మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలోనూ చదివింది. తండ్రికిలానే తనుకూడా చదువుకునే రోజుల్లో మంచి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. కానీ సినిమాల మీద ఆసక్తితో మోడలింగ్‌లోకి ప్రవేశించి కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో తెరంగేట్రం చేసింది. తరవాత హిందీలో వచ్చిన 'ఓం శాంతి ఓం' విజయం సాధించడంతో వెనక్కు తిరిగి చూసుకోలేదనుకోండీ. అన్నట్లూ ఈ మంగళూరు భామ మాతృభాష కొంకణి. 

జెనీలియా... 
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఎంతగానో పేరు తెచ్చుకున్న జెన్నీ మంగళూరు క్యాథలిక్‌ కుటుంబం నుంచి వచ్చింది. మాతృభాష కొంకణి. తల్లి జేనెట్‌ డిసౌజా, తండ్రి నీల్‌ డిసౌజాలు ఉద్యోగ నిమిత్తం ముంబైలో స్థిరపడటంతో జెన్నీ అక్కడే చదువుకుంది. తర్వాత ప్రకటనల్లో నటించడం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. 

శిల్పా శెట్టి 
సాహస వీరుడూ సాగర కన్య... సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ భామ శిల్పా శెట్టి కూడా మంగళూరు అమ్మాయే. తల్లిదండ్రులు సునందా శెట్టి, సురేంద్ర శెట్టి తుళు భాష మాట్లాడే వర్గానికి చెందినవారు. వ్యాపారంలో భాగంగా శిల్పా శెట్టి తండ్రి ముంబైలో స్థిరపడటంతో ఆమె అక్కడే చదువుకుని తర్వాత మోడలింగ్‌ ద్వారా నటిగా ఎదిగింది.
వీళ్లే కాదు, స్నేహా ఉల్లాల్‌, ఫ్రిదాపింటో (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌), లక్ష్మీరాయ్‌, ప్రీతీ జింగానియా, అమృతారావ్‌... ఇలా ఎంతోమంది మంగళూరు భామలు తమ అందచందాలతో అలరిస్తున్నారు. ముంబైలాంటి మహా నగరం నుంచి ఎక్కువ మంది హీరోయిన్లు వస్తున్నారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఎక్కడో కర్ణాటకలోని ఓ ప్రాంతం నుంచి ఇంతమంది ప్రముఖ హీరోయిన్లు రావడమంటే ఆశ్చర్యపోయే విషయమే.  • *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

Your comment is necessary for improvement of this blog