Wednesday, November 6, 2013

Telugu girl-Pragati in bollywoodబాలీవుడ్‌లో తెలుగమ్మాయి-ప్రగతి

 •  

 •  
పరిచయం (Introduction) : 


 •     మొదట మోడలింగ్‌. తరవాత చిన్న సినిమాలు. అదృష్టం కలిసొస్తే అప్పుడు ప్రధాన పాత్రలు. సాధారణంగా ఇదీ సినిమా రంగంలో అడుగుపెట్టే నాయికల పరిస్థితి. కానీ అనంతపురం అమ్మాయి ప్రగతి... ఎకాఎకి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అదీ మామూలుగా కాదు... న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని. 'మంచి అవకాశాలొస్తే తెలుగులో నటించడానికీ సిద్ధమే' అంటూ ఆమె ఇంకా ఏం చెబుతుందంటే...!


  'ఎవరైనా సినిమాల్లో నటించాలనుకుంటే హైదరాబాద్‌కో, చెన్నైకో వెళ్తారు. నువ్వేంటి అమెరికా వెళ్తున్నావు' అంటూ చాలామంది అడిగారు. ఏది చేసినా పక్కాగా ఉండటమే నాకిష్టం. సహజంగా నటించడం నేర్చుకోవాలంటే అంతర్జాతీయ స్థాయి సంస్థలోనే శిక్షణ తీసుకోవాలని అనిపించింది. అందుకే హైదరాబాద్‌లో బీటెక్‌ అయిపోగానే అమెరికా వెళ్లే విమానమెక్కేశా. న్యూయార్క్‌లో ఓ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరిపోయా. అక్కడికి వెళ్లాకే తెలిసింది నటించడంలోనూ రకరకాల పద్ధతులుంటాయని. మరోవైపు సుమారు పదిహేను రకాలకు పైగా నృత్య రీతుల్ని అక్కడ నేర్చుకున్నా. నాలుగేళ్ల వయసు నుంచే నేను కథక్‌ నేర్చుకుంటున్నా. హరిహరకళాభవన్‌, త్యాగరాయ గానసభ లాంటి వేదికలపై ఎన్నో ప్రదర్శనలిచ్చా. దీంతో ఆ డాన్సుల్ని నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు.

  'ఇండియన్‌ ప్రిన్సెస్‌' అనేవారు..
  నటనలో శిక్షణ తీసుకుంటూనే స్టేజి షోల్లో నటించా. న్యూయార్క్‌లో వాటికి ఆదరణ ఎక్కువ. నిజానికి సినిమాల కంటే నాటకాల్లో నటించడమే కష్టం. సినిమాలకైతే ఎక్కువ మంది ముందు నటించాల్సిన అవసరం ఉండదు. ఎన్ని టేకులైనా తీసుకోవచ్చు. కానీ స్టేజి మీద అలా కాదు. ప్రతి కదలికా జాగ్రత్తగా ఉండాలి. అలా పడిన కష్టమంతా ఇప్పుడు సినిమాలకు చాలా ఉపయోగపడుతోంది. నెమ్మదిగా షార్ట్‌ ఫిల్మ్‌లూ, యాడ్‌ ఫిల్మ్‌లలో నటించడంతో గుర్తింపు రావడం మొదలైంది. అక్కడి వాళ్లందరూ 'ఇండియన్‌ ప్రిన్సెస్‌' అని పిలవడం మొదలుపెట్టారు. హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు కొందరు నా గురించి విని, సినిమాలో అవకాశం ఇస్తామన్నారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. నేను అక్కడికి వెళ్లింది స్టూడెంట్‌ వీసాపైన. అందులోని నిబంధనల ప్రకారం నాకు నటించడానికి అవకాశం లేదని చెప్పారు.

  ఈసారి అదృష్టమే..
  కొన్నాళ్ల క్రితం ఓ రోజు బాలీవుడ్‌ దర్శకుడు జెన్నర్‌ జోస్‌ నుంచి ఫోనొచ్చింది. 'ఓ సినిమాకు హీరోయిన్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. న్యూయార్క్‌ థియేటర్‌ వాళ్లు నీ గురించి చెప్పారు. నేను నీ షోలూ, షార్ట్‌ ఫిల్మ్‌లూ చూశాను. నీకు ఆసక్తి ఉందా' అని అడిగారు. లేదని ఎలా చెప్పగలను! కథ కూడా నా నిజజీవితంలో పాత్రకు చాలా దగ్గరగా ఉంది. పైగా బాలీవుడ్‌ సినిమా. వెంటనే ఒప్పుకున్నాను. ఈసారి ఎలాంటి నిబంధనలూ అడ్డు రాలేదు. దీంతో సినిమా షూటింగ్‌ మొదలైపోయింది. దాన్లో నాది భారత్‌ నుంచి అమెరికా వచ్చిన అమ్మాయి పాత్ర. నటన, డాన్సు, హావభావాలు పలికించడంలో అంతకుముందే పూర్తి శిక్షణ పొంది ఉన్నాను కనుక పెద్దగా కష్టపడకుండానే 'వూప్స్‌... ఏ దేశీ'లో నా పాత్రను బాగా చేశాను.

  మా నాన్న కాశీపతి పాత్రికేయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిన్నప్పట్నుంచీ నేను స్కూల్లో టాపర్‌నే. దీంతో చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంజినీరింగ్‌ చదివాకే నటన అని ఇంట్లో వాళ్లు ముందే చెప్పారు. ఒకప్పుడు చెన్నై కళాక్షేత్రంలో శిక్షణ తీసుకుంటానని చెబితేనే ఒక్కదాన్ని పంపించడానికి భయపడి వద్దన్నారు. కానీ నా ఆసక్తిని గమనించి పరాయి దేశానికి పంపించడానికి కూడా ఒప్పుకోవడం నా అదృష్టం. సినిమాలతో పాటూ ఓ నాటకం కూడా రాస్తున్నా. మా సినిమాను ఇక్కడ ప్రివ్యూ థియేటర్లలో ప్రదర్శించాక బాలీవుడ్‌ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈ కెరీర్‌ కోసం చాలా కష్టపడ్డా. అందుకే జాగ్రత్తగా రెండో అడుగు వేయాలనుకుంటున్నా. మంచి అవకాశాలొస్తే తెలుగులో నటించడానికీ సిద్ధమే. ఈ నెలలోనే 'వూప్స్‌... ఏ దేశీ' విడుదలవుతోంది. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని నా నమ్మకం.

జీవిత విశేషాలు (profile) : 
 •  
నటించిన సినిమాలు (filmography ): 
 •  

 •  Courtesy with : Vasundara@eenadu news paper(06-Nov-13)
 • ==================================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS. /

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog