Sandhya Rani (Dubbing Artist)-సంధ్యారాణి(డబ్బింగ్‌)

  •  
  •   
గొంతు నుంచి కాళ్ల వరకూ ఎనిమిది శస్త్ర చికిత్సల కత్తిగాట్లు. ఏడేళ్ల పాటు మెదడు ఒక్కటే పనిచేసి శరీరమంతా చచ్చుబడిన చేదు గతం.'వైకల్యం కదా... నువ్వేం సాధిస్తావు' అనే వెక్కిరింతలు. ఇవేవీ ఆ అమ్మాయి సంకల్పాన్ని నీరుకార్చలేదు. ఇంకా చెప్పాలంటే... మరో అడుగు ముందుకేసేలా చేశాయి. సీరియళ్లతో మొదలుపెట్టి, సినిమాలకు డబ్బింగ్‌ చెప్పే కళాకారిణిగా ఎదిగే స్థాయికి చేర్చాయి. ఆమే సంధ్యారాణి. కష్టాలను దాటిన తీరుని చెబుతున్నారిలా...

'మాయాద్వీపం' గేమ్‌షోలో సాలభంజికలు మాట్లాడినప్పుడూ... 'షిర్డీ సాయి కథ'లో పింకీ మాట్లాడినప్పుడూ మీకు తెరపై కేవలం పాత్రలే కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న గొంతు నాదే! ఇవేకాదు... అగ్నిపూలూ, శ్రావణ సమీరాలూ, రాధామధు, శ్రావణీ సుబ్రమణ్యం, హ్యాపీడేస్‌, శిఖరం, కృష్ణావతారాలూ, పోలీస్‌ డైరీ... ఈ సీరియళ్లు చూసిన వాళ్లకు నా గొంతు కొత్తేం కాదు! 'అరె... ఆ గొంతు ఈ అమ్మాయిదా..' అని అనుకొంటారేమో ఇప్పుడు నా గురించి చదువుతున్న వాళ్లంతా! అయితే చాలామంది నన్ను ఓ వైకల్యం ఉన్న అమ్మాయిగా.. స్టూడియోకి ఎప్పుడూ నాన్న సాయంతో వచ్చే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానే గుర్తు పడతారు. కానీ ఆ వైకల్యమే నా జీవితాన్ని ఇంతవరకూ తీసుకొచ్చిందని చాలా తక్కువ మందికి తెలుసు.

బతికున్న శవంలా...
అమ్మానాన్నలకు మేం ముగ్గురం ఆడపిల్లలం. నేను రెండో అమ్మాయిని. మేం ఖమ్మంలో ఉండేవాళ్లం. ఏడాదిన్నర వయసులో అనుకొంటా, టీకా ఇప్పించినప్పుడు అది వికటించింది. ఏదో ఒక అవయవం కాకుండా మొత్తం శరీరమంతా దాని ప్రభావానికి లోనయింది. శారీరక కదలికలు తగ్గిపోవడంతో అమ్మానాన్నలు వైద్యం కోసం నన్ను హైదరాబాద్‌కి తీసుకెళ్లారట. కొన్ని నెలల పాటు అక్కడే ఉండి, నాకు చికిత్స చేయించారు. కొద్దిగా కోలుకున్నాక ఇంటికి తీసుకొచ్చారు. రెండేళ్లు గడిచాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే, బడికి వెళ్లడం మొదలుపెట్టా. ఐదారు క్లాసులకు వచ్చేప్పటికి ఆరోగ్యం కొంత మెరుగుపడింది. ఇక ఫరవాలేదు అనుకునే సమయంలో ఓ రోజు జ్వరం వచ్చింది. డాక్టర్‌కి చూపించినా తగ్గలేదు. టెంపరేచర్‌ 104 దాటేసింది. జ్వర తీవ్రతను తగ్గించడానికి శక్తివంతమైన స్టెరాయిడ్లు ఇచ్చారు. పదమూడేళ్ల వయసులో నా శరీరం వాటికి తట్టుకోలేక పోయింది. ఓ రోజు ఉన్నట్టుండి పడిపోయా. ఒంట్లో కదలికలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ''కొన్ని లక్షల మందిలో ఒక్కరికే వచ్చే ఆర్ధ్రరైటిస్‌ ఇది. శరీరంలో ఎక్కడెక్కడ కీళ్లు ఉంటాయో అవన్నీ పనిచేయడం మానేస్తాయి'' అని చెప్పారు వైద్యులు. అప్పట్నుంచి నాకు నరకయాతన మొదలైంది. కదలలేక, పనులు చేసుకోలేక, ఒళ్లంతా నొప్పులతో చాలా బాధపడ్డా. అమ్మానాన్నలు చాలా ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎన్ని మందులు వాడినా లాభం లేకపోయింది. నెమ్మదిగా నా శరీరంలో ఒక్కో అవయవం చచ్చుబడిపోయింది. పడుకున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదపలేని పరిస్థితికి చేరుకున్నా. బతికున్న శవంలా మారిపోయా. ఒళ్లంతా బెడ్‌సోర్స్‌. దోమలు ముసురుకునేవి. చీమలు కుట్టేవి. చివరికి చీమలు రాకుండా నా చుట్టూ మందు చల్లేవారు. ఆడపిల్లని కాబట్టి ఒక్క దుస్తులు మార్చే విషయంలో తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో నాన్నే అమ్మయ్యారు. ఫలానా చోట వైద్యం అందుతుందంటే అమ్మానాన్నలు నన్నక్కడికి ఎత్తుకొని తీసుకెళ్లేవారు. అప్పటికే నా వైద్యానికి దాచి పెట్టిందంతా ఖర్చు చేశారు.

ఆ ప్రకటనే అసలైన మలుపు...
'మీ అమ్మాయికి మోకాలి చిప్పలూ, నడుముతో చాలా చోట్ల ఎముకలు రీప్లేస్‌ చేయాలి' అంటే అమ్మానాన్నలు సరే అన్నారు. ఒక శస్త్ర చికిత్స ముగిసింది. రెండో శస్త్ర చికిత్స సమయంలో... మరో సమస్య. 'గొంతులోకి పైప్‌ పంపించాలి. కానీ వీలు కావడం లేదు. గొంతుకోసి అక్కడి నుంచి పైప్‌ సాయంతో ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది, సరేనా...' అని నాన్నని అడిగారు వైద్యులు. శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయక తలెత్తిన ఇబ్బంది అది. నాన్న ఒప్పుకోక తప్పింది కాదు. అలా ఒకటి తరవాత ఒకటి... మొత్తం ఎనిమిది ఆపరేషన్లు చేయించుకున్నా. ఎప్పటికప్పుడు ఇదే ఆఖరి రోజేమో అనిపించేది. కుటుంబ సభ్యులూ, వైద్యుల అండతో శారీరకంగా కోలుకున్న నా జీవితానికి ఏదో లక్ష్యం ఉందని పదేపదే అనిపించేది. వైద్యం పూర్తయి ఇంటికొస్తున్న సమయంలో పేపర్‌లో 'డబ్బింగ్‌లో శిక్షణ తీసుకోండి' అన్న ప్రకటన నన్ను ఆకట్టుకుంది. బాధ పడకుండా నేను చేయగలిగిన పని ఏదయినా ఉందంటే, అది మాట్లాడటమే. స్పష్టంగా మాట్లాడటం నాకున్న వరం. వెంటనే శిక్షణలో చేరా. నేను పడ్డ బాధలతో పోలిస్తే, తరగతులకు వెళ్లడం అసలు కష్టంగా అనిపించలేదు. ఆ బ్యాచిలో చక్కటి గొంతున్న అమ్మాయిగా ప్రశంసలు అందుకున్నా. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. ఏ స్టూడియోకి వెళ్లాలన్నా నాన్న నన్ను భుజానికెత్తుకుని తీసుకెళ్లేవారు. 'గొంతు బాగుంది కానీ... అంతదూరం నుంచి ఈ అమ్మాయి ఎలా రాగలదు... కొన్నిసార్లు కనీసం పెట్రోలు డబ్బులు కూడా రావు' అంటూ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. మొదటిసారి ఈటీవీలో 'అగ్నిగుండం', 'శుభలేఖ' సీరియళ్లకి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. మొదట్లో నిరుత్సాహపరిచిన వాళ్లే నా ప్రతిభ చూసి... నెమ్మదిగా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. కొంత ఆదాయం వస్తుండటంతో, ప్రైవేటుగా బీఏకి కట్టా. కానీ నా ఆరోగ్య పరిస్థితితో ఆఖరి సంవత్సరం పరీక్షలు రాయలేకపోయా.

సినిమాలకూ మాట....
అన్ని ఛానళ్లలో అవకాశాలు వచ్చాయి. ఆదాయమూ పెరిగింది. అయినా డబ్బింగ్‌ కళాకారిణిగా గుర్తింపు లభించలేదు. 'ఈ అమ్మాయికి వైకల్యం ఉంది. రెండు, మూడు అంతస్తులెక్కి పైకి రావాలి. కొన్నిసార్లు అటూఇటూ తిరుగుతూ సందర్భానికి తగినట్టు సంభాషణలు చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ తన వల్ల కాదు. అందుకని డబ్బింగ్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వం'' అన్నారు నిర్వాహకులు. ఆ మాటల్ని సవాల్‌గా తీసుకున్నా. ఆ అర్హతలు నాకున్నాయి అని నిరూపించుకుని, సభ్యత్వం సాధించుకున్నా. తరవాత నటుడు సాయికుమార్‌ నిర్వహించిన 'డీల్‌ ఆర్‌ నోడీల్‌'లో లక్ష రూపాయల వరకూ గెలుచుకున్నా. ఇప్పటి వరకూ సుమారు వంద ప్రకటనల కోసం పని చేశా. యాభై సీరియళ్లకు డబ్బింగ్‌ చెప్పా. వందల ఎపిసోడ్‌ల కోసం సమయం కేటాయించా. హిందీ, ఇతర భాషా చిత్రాలను తెలుగులోకి అనువదించి టీవీల్లో ప్రసారం చేయడం ఇటీవలి కాలంలో పెరిగింది కదా! అలాంటి పది సినిమాల అనువాదం కోసం నేను పని చేశాను. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ కొన్ని అవకాశాలొస్తున్నాయి. 'మనుషులతో జాగ్రత్త'. 'మిస్డ్‌ కాల్‌' సినిమాల్లోని పాత్రలకు డబ్బింగ్‌ చెప్పా. 'తుపాన్‌', 'రామయ్యా వస్తావయ్యా'లో చిన్న పాత్రలకూ గొంతు అరువిచ్చా. కుట్టి బాధపెట్టే చిన్న చీమని కూడా అడ్డుకోలేని నిస్సహాయ పరిస్థితి నుంచి నా జీవితం నేను గడపగలిగే స్థాయికి చేరుకున్నా. ఇప్పటికీ నాన్న సాయం లేకుండా నడవలేను, ఎక్కడికీ వెళ్లలేను. కానీ కచ్చితంగా పూర్తిగా కోలుకుని, మాటలతో మరిన్ని అవకాశాలను సంపాదించుకుంటానన్న నమ్మకం ఉంది.


  • Courtesy with : Vasundara@eenadu news paper(09-Nov-13)


  • ========================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala