Sunday, October 27, 2013

Mukhesh Rishi-ముఖేష్ రిషీ (విలన్‌ నటుడు)

  •  

  •  
పరిచయం (Introduction) : 


  •     ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేని ప్రతినాయకుడు ముఖేష్‌ రుషి. విలన్‌గా నటించడం చాలా సులువు అని చెబుతున్న ముఖేష్‌... తన జీవితంలోకి ఏవీ అంత సులభంగా రాలేదంటున్నారు. తన సినీ జీవిత ప్రస్థానం గురించి ఇలా చెబుతున్నారు.

లైఫ్‌ ఈజీ కాదు. ఏదీ ఎవరికీ సులభంగా రాదు. అయితే, జీవితాన్ని ఈజీగా మార్చుకునే ఫార్ములా ఒకటి ఉంటుంది! దాన్ని ఎవరికివారు తెలుసుకోవాల్సిందే. ఎవరికివారు తయారు చేసుకోవాల్సిందే. ఈరోజున మీరంతా నన్ను ఒక మంచి నటుడిగా గుర్తిస్తున్నారు. ప్రేమాభిµమానాలని పంచుతున్నారు. ప్రస్తుతం నాకు చేతినిండా సినిమాలున్నాయి. ఇక్కడ ఎంతోమంది మంచి మిత్రులు దొరికారు. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. నిజానికి ఇవేవీ నా జీవితంలోకి ఈజీగా వచ్చినవి కావు!

కాలేజీలో ఈజీగా...!
మా కుటుంబ సభ్యులకు తెలిసిన ఈజీ పని స్టోన్‌ క్రషింగ్‌ వ్యాపారం. మా తాతల దగ్గర్నుంచీ నాన్న... అన్నయ్య... అందరూ వ్యాపారంలోనే ఉన్నారు. తరతరాలుగా తెలిసిన పనీ... సులువుగా చేసుకోదగ్గ పనీ కాబట్టి నేనూ పెద్దయ్యాక వ్యాపారమే చేయాలి! ఇంట్లో వాళ్ల ఆలోచన ఇది. మరి నా ఆలోచన... నిజానికి ఏదీ లేదనే చెప్పాలి! నేను పుట్టింది జమ్మూ కాశ్మీర్‌లో. ప్రాథమిక విద్య అంతా అక్కడే. తరువాత చండీగఢ్‌లో చదువుకున్నాను. కాలేజీ రోజుల్లో ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్‌ బాగా ఆడేవాణ్ని. కళాశాల జట్టుకి వైస్‌ కెప్టెన్‌గానూ కొన్నాళ్లున్నాను. బౌలింగ్‌, బ్యాటింగ్‌ బాగా చేసేవాణ్ని. కరాటే కూడా నేర్చుకున్నాను. నేను కాస్త పొడవుగా ఉంటాను కదా. దాంతో 'నువ్వు హీరోలా ఉన్నావురా' అని ఫ్రెండ్స్‌ అనేవారు. యూత్‌ కదా... అప్పట్లో ఆ మాటలు వింటుంటే మాంచి కిక్‌ ఉండేది. అంతేగానీ నేనేదో సినిమా హీరోని అయిపోతా అనే కలలు లేవు. తరువాత ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెరిగింది. జిమ్‌లో చేరాను. కండలు తిరిగే బాడీ కావాలని వ్యాయామాలు చేసేవాణ్ని. అయితే, క్రికెట్‌ కోచ్‌ మాత్రం ఏదో ఒకటే చెయ్‌ అనేవారు! 'క్రికెటర్‌కి కావాల్సిన శరీరాకృతి వేరు. కరాటే చేసేవాడికి ఉండాల్సిన బాడీ షేప్‌ ఇంకో రకం. బాడీ బిల్డర్‌ అవుదామనుకుంటే మరో రకం. నువ్వు ఏదో ఒకదానికి ఫిక్స్‌ అయితే మంచిది. అన్నీ కలిపి చేశావంటే ఆరోగ్యానికి మంచిది కాదు' అనేవారు. అయితే, ఆ వయసులో అన్నీ ఈజీగానే అనిపించేవి. ఏదీ విడిచి పెట్టలేదు.

ఫిజీలో ఈజీగా..!
డిగ్రీ అయిపోయింది. తరువాత నేను చేయాల్సిన పని వ్యాపారం! బిజినెస్‌ అంటే ఇష్టముందో లేదో తెలీదు. అలాగని వ్యతిరేకతా లేదు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ఏదో సాధిద్దామన్న తపనా లేదు. తెలిసిన పనే కాబట్టి ఈజీగానే ఉంటుందని రంగంలోకి దిగాను. వ్యాపారం పనిమీద తరచూ ముంబై వస్తుండేవాణ్ని. కొన్నాళ్లు ఉండి వెళ్తుండేవాణ్ని. చండీగఢ్‌లోనూ మా వ్యాపారం ఉంది. తరచూ అటూఇటూ తిరుగుతుండేవాణ్ని. కొన్నాళ్లకి... రాన్రానూ జీవితం మరీ రొటీన్‌గా మారిపోయిందే అనిపించింది. అదే సమయంలో కేశిని అనే అమ్మాయి పరిచయమైంది. పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. అయితే, ఆ అమ్మాయి ఉండేది ఇండియాలో కాదు.. ఫిజీలో! కేశిని అక్కడికి వెళ్లిపోయిన తరువాత లైఫ్‌ ఈజీగా అనిపించలేదు. ఆమె కోసం నేనూ ఫిజీ వెళ్లిపోయాను. ఇక్కడి వ్యాపారం వదిలేసి అక్కడ కొత్తగా ప్రారంభించాను. అక్కడే కేశినితో పెళ్లయింది. ఫిజీలో జీవితం కొన్నాళ్లు ఈజీగానే సాగిపోయింది. తరువాత, అక్కణ్నుంచి న్యూజిలాండ్‌కి వెళ్లిపోయాం. అక్కడ మోడలింగ్‌పై ఆసక్తి కలిగింది. అక్కడే మోడలింగ్‌ కెరీర్‌ ప్రారంభించాను. మోడలింగ్‌లో ఏదో మజా ఉండేది. పనిలో ఆనందం అంటారు చూశారా... అది పరిచయమైంది! చేస్తున్న పనిలో కిక్‌ అంటే ఏంటో తెలిసింది. అప్పుడు నాకు అర్థమైంది- నేను వ్యాపారానికి సరిపోనని. నటన నాకు సరిపోయే కెరీర్‌ అని. మరి, ఎక్కడో న్యూజిలాండ్‌లో ఉంటే సినిమా అవకాశాలు ఎలా వస్తాయి..? అందుకే, ఈజీగా సాగిపోతున్న న్యూజిలాండ్‌ జీవితాన్ని వదులుకున్నాను.

నటనలో ఈజీగా..!
నటన నాకు ఈజీ కాదు! ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే, మా తాతముత్తాలు ఎవ్వరూ నటులు కాదు. పోనీ, సినీరంగంలో ఎవరైనా బంధువులూ స్నేహితులూ ఉన్నారా అంటే అదీ లేదు. కనీసం కాలేజీ రోజుల్లోనైనా నేను సరదాకి స్టేజెక్కిన సందర్భమూ లేదు. మరేం చేయాలి? ముందు, నటన నేర్చుకుందామని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. పనిలోపనిగా డాన్స్‌ కూడా నేర్చుకున్నాను. కోర్సు పూర్తయ్యాక కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌లో నటించాను. 'థమ్స్‌ అప్‌' యాడ్‌ మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. కాస్త భయం మొదలైంది! ఎందుకంటే, అప్పటికే పెళ్త్లెంది. కుటుంబం ఉంది. ఈజీగా సాగిపోతున్న వ్యాపారాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చేశాను. ఇంట్లో కూడా నా నిర్ణయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. కాబట్టి, సినిమాల్లో నేను కచ్చితంగా సక్సెసై తీరాలి... అంతే! వేరే మార్గం లేదు. ఇలా ఆలోచించేవాణ్ని. దాంతో నటనపై ఏకాగ్రత మరింత పెరిగింది. ప్రముఖ దర్శకుల సినిమాలు బాగా చూసేవాణ్ని. నాటకాలకు వెళ్లేవాణ్ని. ఎక్కడికి వెళ్లినా నా దృష్టంతా నటులపైనే. వాళ్ల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉండేది.

ఆ తరువాత... ఓసారి నేనూ నాతోపాటూ నటనలో శిక్షణ పొందిన మరో మిత్రుడూ ఓ హోటల్లో కూర్చున్నాం. టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. 'దర్శకుడు ప్రియదర్శన్‌ మాంచి బాడీ ఉన్న నటుడి కోసం చూస్తున్నారట. నువ్వు వెళ్లొచ్చు కదా' అని నా మిత్రుడు చెప్పాడు. వాడు చెప్పిన వెంటనే ప్రియదర్శన్‌ని కలిశాను. ఆయన నన్ను చూసీ చూడగానే ''గర్దిష్‌'లో విలన్‌ వేషం ఉంది... చేస్తావా'' అన్నారు. రెండో ఆలోచన లేకుండా ఓకే అనేశాను. హీరో కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నటనలో శిక్షణ పొందుతున్నప్పుడు కూడా ఈ ఆలోచన లేదు. అలాగని విలన్‌ వేషాలే వెయ్యాలనీ నిర్ణయించుకోలేదు. సినిమాల్లో నటించాలి... అంతే! అందుకే, వేరే ఏ ఆలోచనా లేకుండా 'గర్దిష్‌'లో నటించాను. ఆ సినిమా రిలీజ్‌కి ముందు రోజు పాత్రికేయుల కోసం వర్లిలో ఒక షో వేశారు. తెరమీద నన్ను నేను తొలిసారి చూసుకునేసరికి... ఏదో చెప్పలేని ఫీలింగ్‌. ఇంటర్‌వెల్‌ అయ్యేసరికి నన్ను అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారు. నాకెందుకో భయం వేసింది. సినిమా పూర్తవకుండానే థియేటర్‌ నుంచి బయటకి వచ్చేసి నా కారులో ముంబైలోని తాజ్‌ హోటల్‌ వరకూ వచ్చేశాను. అక్కడికి వచ్చాక గుర్తొచ్చింది... సినిమా అయ్యాక ప్రెస్‌మీట్‌ ఉంది కదా అని! అది ఆనందమో భయమో కలనిజమైందన్న సంతోషమో... ఏదో ఎమోషన్‌ నన్ను మైమరపించిన క్షణం అది. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది.

విలన్‌పాత్రలో ఈజీగా..!
నాకు అవకాశాలు ఈజీగానే వచ్చాయి. దర్శకుడు ప్రియదర్శనే ఒక మలయాళీ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. 'గాండీవం'లో కూడా ఆయన వల్ల వచ్చిన అవకాశమే. తెలుగులో నా తొలిచిత్రం అది. అయితే, అందులో నాది తక్కువ నిడివి ఉన్న పాత్ర. తరువాత, హిందీలో వరుస అవకాశాలు రావడం మొదలైంది. అన్నీ విలన్‌ పాత్రలే. అమీర్‌ఖాన్‌ సినిమా 'సర్ఫరోష్‌'తో నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో.. గుణశేఖర్‌ 'మనోహరం'లో అవకాశం ఇచ్చారు. అందులో ప్రధాన విలన్‌ పాత్ర. ఆ తరువాత బాలకృష్ణ చిత్రం 'నరసింహనాయుడు'లో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. తరువాత 'ఇంద్ర'లో విలన్‌. అదీ గుర్తింపు తెచ్చింది. తమిళ, మలయాళీ, కన్నడ, ఒరియా, పంజాబీ, హిందీ... ఇలా వివిధ భాషల చిత్రాల్లోనూ విలన్‌ వేషాలు వచ్చాయి. విలన్‌.... విలన్‌... విలన్‌... నటించడం ఈజీ అయిపోయింది! పని మరీ రొటీన్‌ అయిపోయిందే అనిపించింది. వేరే పాత్రలో నటించి ప్రేక్షకులను ఒప్పించలేనా అన్న ఆలోచన వచ్చింది. కొట్టడం... తిట్టడం... భయపెట్టడం... నాకు వచ్చిన నటన ఇదేనా? అప్యాయతానురాగాలను ప్రతిబింబించే పాత్రల్లో ఈజీగా నటించలేనా? ఇలాంటి ప్రశ్నలు చెలరేగాయి. నా అదృష్టం కొద్దీ అదే సమయంలో 'ఒక్కడు'లో మహేష్‌బాబు తండ్రి పాత్రలో నటించమని దర్శకుడు గుణశేఖర్‌ అడిగారు. ఆ సినిమాతో నాకు పాజిటివ్‌ ఇమేజ్‌ వచ్చింది. అక్కణ్నుంచి విలన్‌ పాత్రలతోపాటూ సెంటిమెంట్‌ వేషాలూ వస్తున్నాయి. అన్నిటినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్ల ప్రేమాభిమానాలకు ఎంతో రుణపడి ఉంటాను.

ఇంట్లో ఈజీగా..!
మాకు ఇద్దరు పిల్లలు. ఒకమ్మాయి, ఒకబ్బాయి. ఖాళీ ఉంటే ముంబైలోనే ఉంటాను. రోజూ ఇంట్లోనే వ్యాయామం. నేను భోజన ప్రియుణ్ని కాదు. చాలా తక్కువగా తింటాను. సలాడ్స్‌ అంటే చాలా ఇష్టం. దైవభక్తి కాస్త ఎక్కువే. మనల్ని ఏదో శక్తి నడిపిస్తోందని విశ్వసిస్తాను. ముందే చెప్పినట్టు లైఫ్‌ ఈజీగా ఉండాలంటే ఒక ఫార్ములా ఉండాలి. నా ఫార్ములా ఏంటంటే... వీలైనంత సింపుల్‌గా బతకాలి. ఏదైనా పని నచ్చకపోతే చెయ్యను. ఎవరు బలవంతం చేసినా నవ్వుతూనే 'నో' చెప్పేస్తాను. మొహమాటపడి ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు. ఎవరికైనా టైమ్‌ ఇచ్చానంటే అనుకున్నట్టు అక్కడ ఉండాల్సిందే. కాస్త ఆలస్యమైనా అవమానంగా భావిస్తాను. ఈ విషయంలో అమీర్‌ఖాన్‌ గురించి చెప్పుకోవాలి. ఆ మధ్య అతడి సినిమాలో నటిస్తున్న ఓ ప్రముఖ నటుడు రోజూ ఆలస్యంగా సెట్స్‌కి వస్తుండేవాడు. ఆ విషయం అతడికి తెలియజేయాలని అమీర్‌ ఓ ప్లాన్‌ వేశారు. 'రేపు షూటింగ్‌కి నేనే ఆలస్యంగా వస్తాను. మీరు నన్ను అందరి ముందూ గట్టిగా తిట్టండి' అని దర్శకుడితో చెప్పారు. అనుకున్నట్టే మర్నాడు అమీర్‌ ఆలస్యంగా రావడం... సెట్‌లో అందరిముందూ దర్శకుడు తిట్టడం జరిగింది. చెప్పాలనుకున్న విషయం ఆ సీనియర్‌ నటుడికి చేరింది. అంటే, మనం చెప్పాలనుకున్నది ఇతరులను నొప్పించకుండా చెప్పడానికి ఓ పద్ధతి ఉంటుంది. నేనూ అదే ఫాలో అవుతుంటాను. అందుకే, ప్రస్తుతానికి లైఫ్‌ ఈజీగా సాగిపోతోంది.
టూకీగా...!
బాలకృష్ణ: 'నరసింహనాయుడు' నుంచి ఆయనతో పరిచయం. చాలా మంచి వ్యక్తి. ఆయనతో మాట్లాడుతుంటే ఒక ఆత్మీయుడితో ఉన్నట్టు ఉంటుంది. పెద్ద స్టార్‌ పక్కన నిలబడ్డామన్న ఫీలింగ్‌ ఉండదు. ఈ మధ్యనే ఆయన చేతుల మీదుగా ఓ అవార్డు కూడా అందుకున్నాను.

చిరంజీవి: స్నేహపూర్వకంగా ఉంటారు. ముంబైలో మేము ఉంటున్న ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాకపోయినా సరే 'ఇంద్ర' సినిమా చూశారు. అక్కణ్నుంచి చిరంజీవి అభిమానులైపోయారు. వాళ్ల ఇళ్లలో చిరంజీవి సినిమాల డీవీడీలు చాలానే కనిపిస్తుంటాయి.

పవన్‌ కల్యాణ్‌: చాలా తక్కువ మాట్లాడతారు. అయితే, తనకి ఇష్టమైన టాపిక్స్‌ చర్చకి వస్తే ఆయన ఎంతో సరదాగా మాట్లాడతారని తెలుస్తుంది. మా మధ్య ఎక్కువగా పుస్తకాల గురించీ వ్యాయామాల గురించీ చర్చలు జరుగుతుంటాయి.

యువతరం: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ... ఇలా ఈతరం హీరోలందరిలోనూ ఎనర్జీ లెవెల్స్‌ బాగుంటాయి. సెట్స్‌లో కష్టపడే తీరు చాలా బాగుంటుంది.
రెండు అనుభవాలు
ఇడ్లీ సాంబారుతో..: చిన్నప్పుడు కాశ్మీరులో మేముండే ప్రాంతంలో మదరాసీలు ఉండేవారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఎవరొచ్చినా మేము వాళ్లని మదరాసీలు అనే వాళ్లం. వాళ్ల పిల్లల్తో కలసి ఆడుకునేవాణ్ని. మా ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్లంతా నన్ను బాగా చూసుకునేవారు. ఇడ్లీ సాంబారు పెట్టేవారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత... దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నన్ను ఇంతగా ఆదరిస్తారని అప్పుడు వూహించలేదు. ఇలా ఆలోచిస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది.

యశ్‌రాజ్‌తో..: కొన్ని సినిమాల్లో విలన్‌ వేషాలు వేశాక ఓసారి యశ్‌చోప్రాగారిని కలిశాను. మీ సినిమాల్లో విలన్‌ వేషాలుంటే నాకో అవకాశం ఇవ్వండని అడిగాను. ఆయన నా క్రమశిక్షణ గురించి విన్నారట. చాలా మెచ్చుకున్నారు. తరువాత... 'నా సినిమాల్లో విలన్లు ఉండరు కదా! ఏం చేద్దాం' అన్నారు. ఏం ఫర్వాలేదు సార్‌. మీకు విలన్‌ అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పేసి వచ్చేశాను. ఆయన సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం ఇప్పటికీ ఓ కలగానే మిగిలిపోయింది.

జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : Mukhesh-ముఖేష్ (విలన్‌ నటుడు)
  • పుట్టిన ఊరు : కాశ్మీరు ,
  • చదివిన ఊరు : చండీఘర్ , 
 నటించిన సినిమాలు (filmography ):

  •  ==============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog