Harsha Vardhan(actor)-హర్ష వర్ధన్‌(నటుడు)




పరిచయం (Introduction) : 

  • అమృతం'లో హర్షవర్దన్‌ అమృతరావు... అందరికీ తెలుసు. 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాకు డైలాగ్‌, స్క్రీన్‌ప్లే రచయిత... కొందరికే తెలుసు. 'మనం'కు మాటల రచయిత... విడుదలకు ముందు ఎవరికీ తెలీదు! ఇంతేనా, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత... తెరవెనుక హర్ష పోషించిన పాత్రలు ఎన్నో. కెరీర్‌, జీవితం, సంతోషం, బాధ... అన్నీ అతనికి సినిమాలే. 'పదహారేళ్ల ప్రయాణం ఎలా ఉంది' అని పలకరిస్తే 'జీవిత కాలపు పాఠాలు నేర్పింది' అంటున్నాడు.

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Harsha Vardhan(actor)-హర్ష వర్ధన్‌(నటుడు)
  • పుట్టిన ఊరు : విజయనగరం , 
  • నాన్న : రాధాక్రిష్ణ (లెక్చరర్),
  • అమ్మ : సుజాత (గాయని),
  • తోబుట్టువులు : ఒక చెల్లి ,

Career(కెరీర్) : 


  • ఎవరి జీవితమైనా 'చిన్నప్పుడు మా వూళ్లో...' అంటూ హాయిగా మొదలవుతుంది. కానీ అలా చెప్పుకునేంత అందమైన బాల్యం, మరచిపోలేని జ్ఞాపకాల్లాంటివి నాకు చాలా తక్కువ. నేను పుట్టి పెరిగింది విజయనగరంలో. చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక టెన్షన్‌, గొడవ. ఒక సమస్య పోతే మరొకటి ఎదురయ్యేది. ఏ విషయంపైనా పూర్తిగా దృష్టి పెట్టలేకపోయేవాణ్ని. చివరికి చదువుపైన కూడా. అందుకే టెన్త్‌లోనూ ఫెయిలయ్యా. 'ఎవరో చెప్పింది తిరిగి అప్పజెప్పడమే కదా చదువంటే, దాని వల్ల ఏంటి ఉపయోగం' అన్న ఆలోచన నాలో పెరిగింది. జీవితమే అన్నీ నేర్పిస్తుందన్నది నా అభిప్రాయం. అప్పట్నుంచే చదువుకొని ఉద్యోగాలు చేయాలన్న ఆశ పోయింది. ఈ సమస్యలు మరచిపోవాలంటే ఏదో ఒక వినోదం కావాలి. సంగీతం, సినిమాల్లోనే దాన్ని వెతుక్కున్నా. మనసుకు నచ్చిన సినిమాను మళ్లీ మళ్లీ చూసేవాణ్ని. వీధిలో ఎవరైనా చిన్న చిన్న సంగీత పరికరాలు అమ్ముతుంటే వాటిని కొని వాయిస్తూ పాడుకునేవాణ్ని. ఎలాంటి శిక్షణా లేకపోయినా సంగీతం వచ్చినట్లే వాయించేవాణ్ని. మా అమ్మ సుజాత మంచి గాయని, బహుశా తననుంచే వచ్చిందేమో! నా టాలెంట్‌ చూసి ఇంట్లో వాళ్లు బావుందంటూ అభినందించినా, ఎక్కడ నా దృష్టి ఆవైపు వెళ్లిపోతుందోనని ఎక్కువగా ఆ ప్రస్తావన తెచ్చేవాళ్లు కాదు. నాకేమో నెమ్మదిగా సినిమాలపైన ఆసక్తి పెరుగుతూ వచ్చింది. వేరే కెరీర్‌ గురించిన ఆలోచనే లేదు.


హాల్లో డైలాగులు...

  • సినిమాలు చూడటం కంటే వినడం బాగా అలవాటు. అప్పట్లో అన్ని సినిమాలూ ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చేవి. వాటిని పదేపదే వినడం వల్ల డైలాగులు బాగా వచ్చేసేవి. తగరపువలసలో మా మామయ్య ఇంటికి సెలవుల్లో వెళ్లేవాణ్ని. వాళ్లింటి పక్కనే 'తాతా' థియేటర్‌ ఉండేది. మేడమీదికెక్కితే హాల్లో నుంచి డైలాగులు వినిపించేవి. అలా సినిమాలు వినడం ఓ అలవాటుగా మారింది. చిన్నప్పుడు నలుగురిలో మాట్లాడాలంటే నాకు విపరీతమైన భయం. స్టేజీ ఫియర్‌, మైక్‌ ఫియర్‌ అన్నీ ఉండేవి. ఎక్కువమంది ఎదురుగా ఉంటే మాటలూ తడబడుతుండేవి. అందుకేనేమో నేను పెద్దయ్యాక సినిమాల్లోకి వెళ్తానని చెబితే స్నేహితులు కూడా నవ్వేవాళ్లు. కానీ టెన్త్‌లో ఉన్నప్పుడు ఓసారి ధైర్యం చేసి అందరితో కలిసి నేనూ ఓ నాటకంలో పాల్గొన్నా. ఆ తరవాతే నేనూ నటించగలనన్న ధైర్యం వచ్చింది. అందుకే డిగ్రీ పూర్తయ్యాక ఇక సినిమాల్లోకి వెళ్లాల్సిందే అనుకొని హైదరాబాద్‌ బయల్దేరా.


రుతురాగాలతో మొదలు...

  • డిగ్రీలో మ్యాథ్స్‌ తీసుకోవాలా, లేక ఆర్ట్సా అంటే తల్లిదండ్రులు సలహా ఇస్తారేమో కానీ, అసలు చదువే మానేస్తానని చెబితే! మా ఇంట్లో అదే పరిస్థితి. నాన్న రాధాకృష్ణ లెక్చరర్‌. సినిమాలతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదు. అందుకే నా నిర్ణయం చెప్పినప్పుడు కంగారు పడ్డారు. నేను వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో కాదనలేక పంపించారు. హైదరాబాద్‌లో నా ఫ్రెండ్‌ ఆశీర్వాద్‌ లూక్‌ దగ్గరకు వచ్చా. తను చిన్నచిన్న సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. నేను అతని దగ్గర అసిస్టెంట్‌గా చేరా. తనకు అవకాశాలుంటేనే నాకు పని. అవి అంతంతమాత్రంగా ఉండేవి. పోనీ వూరెళ్లిపోదామంటే, అక్కడికెళ్లి ఏ పనీ చేయలేను. కాబట్టి ఇక్కడే ఉండి ప్రయత్నించాలనుకున్నా. పాటల రికార్డింగ్‌ పనిమీద తరచూ స్టూడియోల చుట్టూ తిరిగేవాణ్ని. అప్పుడే తెలుగులో మొట్టమొదటి డైలీ సీరియల్‌ 'రుతురాగాలు' షూటింగ్‌ జరుగుతోంది. దానికి బడ్జెట్‌ తక్కువ. ఆదరణ పొందుతుందో లేదో తెలీదు. పెద్ద ఆర్టిస్టులకు డబ్బులివ్వలేక కొత్త వాళ్లకోసం వెతుకుతున్నారు. అప్పుడే రచయిత శౌరి నన్ను చూసి 'నువ్వు సీరియల్‌లో నటిస్తావా' అనడిగారు. నా దృష్టంతా అప్పుడు సంగీతం పైనే ఉండేది. గడ్డం, జుట్టూ బాగా పెంచుకునేవాణ్ని. మొటిమలూ ఎక్కువగా ఉండేవి. నటుడంటే ఎప్పుడూ అందంగా కనిపించాలి కదా అనిపించింది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని ఆ సీరియల్‌కు ఓకే చెప్పా.


ఏడువిభాగాల్లో పని...

  • రుతురాగాలు అందరి అంచనాలనూ తలకిందులు చేసింది. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ఎంతోమందికి అది జీవితాన్నిచ్చింది. నేను ఫలానా అని తెలియక మా నాన్న స్నేహితులు 'ఆ కుర్రాడు బాగా నటిస్తున్నాడు కదా' అని చెప్పేవాళ్లట. ఆ గుర్తింపును చూసి అక్కడ మా వాళ్ల మనసూ కాస్త కుదుటపడింది. రుతురాగాలు తరవాత అంత పేరు తీసుకొచ్చిన సీరియల్‌ 'కస్తూరి'. దానికి టైటిల్‌ సాంగ్‌ నేనే రాసి, కంపోజ్‌ చేసి పాడాను కూడా. మొత్తం ఏడు విభాగాల్లో ఆ సీరియల్‌కు పనిచేశా. 'వందేమాతరం' అని చరిత్రకు సంబంధించిన ఓ సీరియల్‌ సింగిల్‌ ఎపిసోడ్లుగా వచ్చేది. దానికి పూరి జగన్నాథ్‌ దర్శకుడు. నాది ప్రధాన పాత్ర. కానీ అప్పుడు మా గురించి కొంతమందికే తెలుసు. అ తరవాత గాజుపూలు, శాంతి నివాసం లాంటి మంచి సీరియళ్లలో నటించా. ఏదో ఒక అవకాశం వస్తుండటంతో సినిమాల పైన మొదట్లో చూపించిన ఉత్సాహాన్ని తరవాత కొనసాగించలేకపోయా. అందుకే సీరియళ్లలో ఓ పదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలీదు. వాటి ద్వారా కావాల్సినంత గుర్తింపూ దక్కింది. సినిమాల్లో అయితే జాబుతో పాటు జేబు సంతృప్తి కూడా ఉంటుంది కదా! కానీ మంచి సీరియళ్లు రావడంతో సినిమా ప్రయత్నాలు దాదాపు చేయలేదనే చెప్పాలి.


పదమూడు చాలనుకున్నాం!

  • శాంతి నివాసం సీరియల్‌లో మొదట నా పాత్ర చచ్చిపోతుంది. అది ఉన్నన్ని రోజులూ బావుందని రాజమౌళి మళ్లీ ఆ పాత్రను బతికించారు. అప్పుడే ఆయనకు 'స్టూడెంట్‌ నెం.1' తీసే అవకాశం వచ్చింది. దాంతో ఆ సీరియల్‌కు వేరే దర్శకులు పనిచేయడం మొదలుపెట్టారు. గతంలో నేను పనిచేసిన సీరియళ్ల గురించి రాఘవేంద్రరావుకి తెలిసి 'శాంతి నివాసం'కు కథ రాయమన్నారు. అది నచ్చడంతో నా సన్నివేశాలకు దర్శకత్వం వహించే అవకాశాన్నీ నాకే ఇచ్చారు. గుణ్ణం గంగరాజుకి నా గురించి తెలిసి 'అమృతం' బృందంలో నన్ను భాగస్వామిని చేశారు. శివాజీ రాజా నటించేప్పుడు కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం కూడా చేశా. అమృతరావుగా మొదట శివాజీ రాజా నటించారు. తరవాత నరేష్‌ నటించినా, రాజకీయాల్లో బిజీ కావడంతో తప్పుకున్నారు. ఛానల్‌ వాళ్లు మిగిలిన పదమూడు ఎపిసోడ్లు తీసి ఆపేయమన్నారు. ఆ పాత్రకు ఎవరిని ఎంచుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు రాజమౌళినే 'హర్షతో తీయొచ్చుగా' అని చెప్పారు. అలా పదమూడు ఎపిసోడ్లే కదా అని మొదలుపెట్టాం. 'అమృతం'కి ముందు నావన్నీ ట్రాజెడీ, లవ్‌ ఫెయిల్యూర్‌ పాత్రలు. 'అమృతం' లుక్‌ తేవడం కోసం గంగరాజు నాలో చాలా మార్పులు చేశారు. అప్పుడే మంచి కథలు పడి, టీఆర్‌పీ విపరీతంగా పెరిగింది. ఛానల్‌ వాళ్లు సీరియల్‌ను కొనసాగించమన్నారు. అలా పదమూడు ఎపిసోడ్లు అనుకుంటే, రెండొందలకు పైగా ఎపిసోడ్లలో నటించా. మధ్యలో యాభైకి పైగా ఎపిసోడ్లకు దర్శకత్వం కూడా వహించా. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆ సీరియల్‌కు హిట్లు వస్తూనే ఉంటాయి. ఆ సీరియల్‌ సమయంలోనే 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'పౌర్ణమి' లాంటి సినిమాల్లో మంచి పాత్రలూ దక్కాయి.


అవసరంతోనే పనులు...

  • 'గుండె జారి గల్లంతయ్యిందే' నితిన్‌ కెరీర్‌ను ఓ మెట్టు పైకి తీసుకెళ్లిన సినిమా. ఆ సినిమాకు డైలాగులూ, స్క్రీన్‌ప్లే అందించడాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నా. నిజానికి మొదట ఆ కథ నితిన్‌కు ఆసక్తి కలిగించలేదు. తరవాత ఒక్కో సన్నివేశాన్ని మళ్లీ రాసి సృష్టించిన కన్‌ఫ్యూజన్‌ డ్రామా అతనికి నచ్చింది. ప్రేక్షకులకు అనుకున్నట్లుగా అది చేరింది. ఆ సినిమాకంటే ముందే 'విశాఖ ఎక్స్‌ప్రెస్‌', 'ద్రోణ' లాంటి సినిమాలకు మాటలు రాశా. 'ద్రోణ' సమయంలోనే నితిన్‌కు నా పనితీరు నచ్చి 'ఇష్క్‌' సినిమా కోసం పనిచేయమన్నారు. అందులో నేను రాసిన కొన్ని సన్నివేశాలూ, డైలాగులూ దర్శకుడు విక్రమ్‌కూ బాగా నచ్చాయి. అందుకే నాకు 'మనం' సినిమాకు మాటల రచయితగా అవకాశం ఇచ్చారు. అలా నా పేరు పడని రెండు సినిమాలు, నా కెరీర్‌కు గొప్ప పేరు తీసుకొచ్చాయి. సంగీతం పైన ఆసక్తి ఉన్నా కేవలం సంగీత దర్శకుడినే అవ్వాలనుకోలేదు. ఏ అవకాశం దొరికినా చేద్దామనుకున్నా. అందుకే ఇన్ని విభాగాల పైన పట్టు దొరికింది. చదువుపైన ఆసక్తి లేదన్న నేను డైలాగులూ, కథలూ ఎలా రాస్తానన్న సందేహం రావొచ్చు! చెప్పాకదా చిన్నప్పుడు సినిమాలను బాగా వినేవాడినని. అలా వింటూనే దానికి తగ్గ సన్నివేశాలను మనసులో వూహించుకునేవాణ్ని. తరవాత సినిమా చూసినప్పుడు నా ఆలోచనకు అవి ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించేవాణ్ని. అలా తెలీకుండానే డైలాగులూ, స్క్రీన్‌ప్లే పైన అవగాహన పెరిగింది. అవసరమే మనిషితో సాధన చేయిస్తుంది, అదే విజయాన్ని అందిస్తున్నది నా నమ్మకం.


పెళ్లివరకూ వచ్చినా...

  • చిన్నప్పట్నుంచీ ఎన్నో సమస్యలను చూశా. దాంతో కుటుంబ జీవితం ఎప్పుడూ సంతృప్తినివ్వలేదు. పెళ్లిపైన కూడా సానుకూల అభిప్రాయం కలగకపోవడానికి అదే కారణం. నా బంధువులూ, స్నేహితుల్లో చాలామంది వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటినుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న స్నేహితులూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్లందరినీ చూశాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనా తగ్గుతోంది. నిజానికి ఈ పదహారేళ్లలో ఏడెనిమిది సార్లు నా ప్రేమ పెళ్లి వరకూ వచ్చింది. అన్నిసార్లూ బెడిసికొట్టింది. పెళ్లి తరవాత రావల్సిన కష్టాలు ముందే మొదలయ్యాయి. అవతలి వ్యక్తి నా నుంచి ఆశిస్తున్నవి నేనివ్వలేనేమో అని అనిపించింది. అందుకే పెళ్లి చేసుకోలేదు. అలాగని చేసుకోననీ చెప్పట్లేదు. కాకపోతే అది పదిరోజుల్లో కావొచ్చు, పదేళ్లకు జరగొచ్చు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాస్త స్థిరపడ్డాక కొంత మందిని దత్తత తీసుకోవాలనుంది. 'మనం' తరవాత నితిన్‌, కరుణాకరన్‌ల సినిమాకు మాటలు రాస్తున్నా.

నా గతం కంటే ప్రస్తుతం చాలా బాగుంది. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నా నమ్మకం. అందుకే నిద్రకు ముందూ, లేచిన తరవాతా దేవుడికి 'థ్యాంక్స్‌' చెప్పడం మినహా మరేదీ అడగను.
చెల్లెలే స్ఫూర్తి...

  • జీవితంలో నాకు అందరికంటే ఎక్కువ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నా చెల్లెలే. చిన్నప్పట్నుంచీ ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడి వాటి నుంచి బయటపడేది. తన ధైర్యంలో యాభై శాతం నాకున్నా ఇంతకంటే మంచి స్థాయిలో ఉండేవాణ్నని అనిపిస్తుంది.

* హైదరాబాద్‌ వచ్చేనాటికి నేను సాధించిందీ, సంపాదించిందీ ఏమీ లేదు. కాబట్టి కాలం, జీవితం తప్ప పోయేదీ ఏదీ లేదు. అందుకే వచ్చిన అవకాశాలకు సంతోష పడటం తప్ప, కోల్పోయినవాటికి బాధపడటం తెలీదు. నా కలలూ, ఆశలూ చాలా చిన్నవి. ప్రణాళిక వేసుకుని జీవించడం నాకస్సలు నచ్చదు. ఎలా వచ్చిన జీవితాన్ని అలానే ఆస్వాదించాలి. అప్పుడు జీవితానికి హద్దులూ, అసంతృప్తులూ ఉండవు.

  • * సినిమాల కోసమే కాదు, నాకోసం కూడా నేను రాసుకుంటా. పాటలు రాసుకొని పాడి రికార్డు చేసి దాచుకుంటా. అవి ప్రేక్షకుల ముందుకు వస్తాయో లేదో చెప్పలేను. ఆరుగంటల నిద్ర, మూడుపూట్లా తిండి లాంటి రొటీన్‌ జీవితమంటే ఆసక్తిలేదు. రాత్రి రెండుకు లేచి పనిచేసుకుని, పొద్దున తొమ్మిదికి టిఫిన్‌ చేసి పడుకున్న రోజులు ఎన్నో. నా ఫ్లాటే నాకు నచ్చే హాలీడే స్పాట్‌.



  • Courtesy with Eenadu sunday magazine: 09/2014


కొన్ని సినిమాలు (filmography ): 

  • 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాకు డైలాగ్‌, స్క్రీన్‌ప్లే రచయిత.
  • 'మనం'కు మాటల రచయిత... ,
  • ఐతే , 
  • అనుకోకుండా ఒక రోజు , 
  • పౌర్ణమి, 
  • విశాఖ ఎక్షప్రెస్ (మాటలు వ్రాసారు),
  • ద్రోణ (మాటలు వ్రాసారు), 
  • ఇష్క్ (కొన్ని డైలాగ్స్ ),
కొన్ని సీరియల్స్ : 
  • రుతురాగాలు , 
  • కస్తూరి , 
  • వందేమాతరం , 
  • గాజుపూలు , 
  • శాంతినివాసం , 
  • అమృతం , 


  •  *==============================*


 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala