Monday, September 8, 2014

Lanka Satyanand-లంక సత్యానంద్(actor,cinema director,Star maker)


 • Courtesy with : Eenadu news paper sunday magazine 07-09-2014.


పరిచయం (Introduction) : 


 • అందరికీ తాజ్‌మహల్‌ అందమే కనిపిస్తుంది. కానీ కొందరే దాని వెనకున్న శిల్పి నైపుణ్యాన్ని గుర్తించేది. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, రవితేజ... వీళ్లంతా మన వెండితెర తాజ్‌మహళ్లయితే, లంక సత్యానంద్‌... వాళ్ల వెనకున్న శిల్పి! నటనలో ఆయన దగ్గర మెలకువలు నేర్చుకున్న కుర్రాళ్లు, ఇప్పుడు తెలుగువాళ్లకు సూపర్‌స్టార్లు. ఓ సాధారణ రంగస్థల నటుడు 'స్టార్‌మేకర్‌ సత్యానంద్‌.


 జీవిత విశేషాలు (profile) : 

 • పేరు : లంక సత్యానంద్ , 
 • ఊరు : విశాఖపట్నం , 


కెరీర్ : 

 • ఇప్పుడు సినిమాలకు ఉన్నదానికంటే రెండింతలు క్రేజ్‌ అప్పట్లో నాటకాలకు ఉండేది. మా మేనమామ నాటకాలకు దర్శకత్వం చేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కథా చర్చలూ, మేకప్‌లూ, రిహార్సల్స్‌తో ఓ మినీ థియేటర్‌లా ఉండేది. ఇంకా బడి మొహమే చూడని వయసులోనే నాటకాలను చూశా. ఓసారి ఏదో నాటకంలో బాలనటుడు రాలేదని మామయ్య నన్ను నటించమన్నారు. అలా ఏడేళ్ల వయసులో రంగస్థలంపైన రంగప్రవేశం జరిగింది. రంగురంగుల దుస్తులూ, ప్రేక్షకుల చప్పట్లూ, స్నేహితుల పొగడ్తలూ... ఆ మైకం నుంచి బయటపడటం జరిగే పనేనా! ఒక్క నాటకంతో మొదలైన ప్రయాణం మరెక్కడా ఆగలేదు. ఓసారి విజయనగరంలో జరిగిన నాటకోత్సవానికి ఎస్వీ రంగారావు ముఖ్యఅతిథి. మేం వేసింది 'విధి' అనే నాటకం. ఆ తరవాత వేరే నాటకాలన్నీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. అప్పుడు బహుమతుల ప్రదానం మొదలైంది. అందరికీ ఇచ్చేశాక 'ఇందాక ఆ పిల్లాడు చాలా బాగా నటించాడు కదా, అతనికేదీ బహుమతి' అని ఎస్వీరంగారావు అడిగారు. బాలనటులకు బహుమతి లేదని తెలిసి 'మీరిచ్చేదేమిటి... ఆ అబ్బాయికి మేమే ఇస్తాం' అంటూ అప్పటికప్పుడు నూట పదహారు రూపాయలిచ్చి పెద్ద వెండికప్పును తెప్పించారు. ఓ పెద్దాయన నిద్రపోతున్న నన్ను అలానే ఎత్తుకుని 'నీకు బహుమతి వచ్చింది' అంటూ స్టేజీ మీదకు తీసుకొచ్చారు. అసలే నిద్ర మత్తు, ఎదురుగా మేరు పర్వతంలా ఉన్న ఎస్వీరంగారావు... ఆయన స్థాయీ, విలువా తెలియని వయసు నాది. ఏం జరుగుతుందో తెలీక ఏడ్చేశా. ఆయన నా చేతిలో కప్పును పెట్టిన సంఘటన ఇప్పటికీ కళ్ల ముందే ఉంది. 


 • ప్యాంటు అప్పుచేశా...

  • నిక్కర్లు వేసుకునే వయసులోనే నాటకాలకు దర్శకత్వం చేయడం మొదలుపెట్టా. ఓసారి మా నాటకానికి హీరోయిన్‌ అవసరమైంది. తెలిసినాయన ఒకరు 'అమ్మాయిని నేను చూపిస్తా, రేప్పొద్దున అనకాపల్లి వెళ్దాం' అన్నారు. సరేనన్నా. వెంటనే 'ఇలాగానీ వస్తావేంటీ? నువ్వు డైరెక్టర్‌వి, ప్యాంటు వేసుకుని రా' అన్నారు. నాకేమో ప్యాంట్లు లేవు. పదో తరగతి పాసైతేనే ప్యాంట్లు కొనిస్తామని ఇంట్లోవాళ్లు అన్నారు. దాంతో తెలిసిన వాళ్ల దగ్గర ఓ ప్యాంటు అప్పు తీసుకుని బయల్దేరా. జీవితంలో తొలిసారి ప్యాంటు వేసుకున్నా, అదీ అరువుదీ, అందులోనూ అది చాలా వదులుగా పొడవుగా ఉంది... అప్పుడు నా అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎలాగోలా హీరోయిన్‌ అయితే దొరికి నాటకం పూర్తయింది. ఇరవయ్యేళ్ల వయసులో సోమయాజులు నటించిన ఓ నాటకాన్ని డైరెక్ట్‌ చేశా. అదీ 'శంకరాభరణం' తరవాత. నేను తీసిన 'అడివి దివిటి' అనే నాటకం ఒకే థియేటర్‌లో 51రోజులు నడిచింది. 'బొమ్మలాట' అయితే 102 రోజులపాటు టికెట్‌ షోగా ప్రదర్శితమై జాతీయ స్థాయి పోటీలకూ ఎంపికైంది. 98సార్లు ఉత్తమ నాటక దర్శకుడిగా వేర్వేరు అవార్డులు అందుకున్నా. దేవిశ్రీప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి అయితే నన్ను 'రంగస్థల రాఘవేంద్రరావు' అని పిలిచేవారు. 
  పెళ్లి చెడిపోయినా...
  • ఓసారి మా మేనత్త కూతురిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు నిశ్చయించారు. తాంబూలాలు కూడా తీసేసుకున్నారు. రోజూ రాత్రంతా రిహార్సల్స్‌ చేసి తెల్లవారు జాము మూడు, నాలుగు ప్రాంతంలో ఇంటికి రావడం అలవాటు. నా పద్ధతిని గమనించి మామయ్య ఓరోజు 'ఏం చేస్తున్నావు' అనడిగాడు. నాటకాలు అన్నా. 'ఉద్యోగం సంగతి ఏంటి?' అంటే 'ఇష్టం లేదు, ఇప్పుడే చేయను' అన్నా. వెంటనే మా నాన్నగారి దగ్గరికెళ్లి 'బావా ఈ పెళ్లి క్యాన్సిల్‌' అన్నారు. నేను హడావుడిగా బయటికెళ్తుంటే మా అమ్మ అడ్డుతగిలి 'అక్కడ నీ పెళ్లి ఆపేస్తున్నార్రా' అంటే 'తప్పుకోమ్మా, రిహార్సల్స్‌కు టైమవుతోంది' అనుకుంటూ బయటికొచ్చేశా. సినిమా సన్నివేశంలా అనిపించినా, నాటకాల కోసం పెళ్లిని కూడా కాదనుకున్నా. ఎంత పిచ్చి ఉండేదంటే... మా నాన్నగారు పోయిన రోజు సాయంత్రం, తాతగారు పోయిన రోజూ కూడా నాటకం వేశా. 
  ఉద్యోగాలు మానేశా...
  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో పనిచేసేవాణ్ని. నాకేమో పొద్దున లేస్తే బయటికెళ్లి నాటకాల పనుల్లో బిజీగా గడపడం అలవాటు. యూనివర్సిటీలో పెద్దగా పనుండేది కాదు. అందుకే బాగా ఆలోచించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశా. నాటకాలకు ఇబ్బందిగా ఉన్నాయని బీహెచ్‌పీ, కోరమండల్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాలకూ రాజీనామా చేశా. ఓసారి జంధ్యాలగారు నేను తీసిన 'వూరేగింపు' నాటకం చూసి పట్టరాని సంతోషంతో నా చేతిలో ఐదొందల రూపాయల నోటు పెట్టారు. మా బృందంలో ఒకరైన లక్ష్మీనరసింహరావుకు నటుడిగా, నాకు దర్శకత్వ శాఖలో 'మల్లెపందిరి' అనే సినిమాలో జంధ్యాల అవకాశం కల్పించారు. లక్ష్మీ నరసింహారావు అంటే ఎవరో కాదు... తరవాతి కాలంలో ఎంతో పేరు సంపాదించిన సుత్తి వేలే. ఆ తరవాత మంచు పల్లకి, శ్రీమతి కావాలి, కళ్లు, చైతన్యం లాంటి సినిమాలకూ దర్శకత్వ శాఖలో పనిచేశా. 
  అ,ఆ... నుంచి నేర్పిస్తా
  • 'మంచు పల్లకి' సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు చిరంజీవిగారి సినిమాలు నేను పెద్దగా చూసింది లేదు. ఎందుకైనా మంచిదని ముందు రోజు 'న్యాయం కావాలి' సినిమా చూసి వెళ్లా. ఆ సినిమాలో నటులకు డైలాగులు నాతో చెప్పించేవాళ్లు. నన్ను గమనించిన చిరంజీవిగారు పిలిచి 'నా సినిమాలు ఏవి చూశావు' అనడిగారు. 'న్యాయం కావాలి చూశా' అన్నా. అలా మాటల్లో మాటగా నాకీ ప్రతిభ ఎలా వచ్చిందని అడిగితే నాటకాల గురించి చెప్పా. నాకంటే పెద్ద వాళ్లనీ, అదీ అనుభవం లేని వాళ్లనీ నేను డైరెక్ట్‌ చేస్తానని తెలిసి ఆశ్చర్యపోయారు. కొత్తవాళ్లు ఎవరొచ్చి ఆసక్తి ఉందని చెప్పినా, వాళ్లను నాటక బృందంలో చేర్చుకుని నడక నుంచి నటన వరకూ అన్నీ నేర్పించడం నాకో సవాలులా అనిపించేది. 
  చెప్పిందే జరిగింది...
  • చిరంజీవిగారి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్న రోజులవి. ఓ రోజు చిరంజీవిగారే ఏదో డైలాగ్‌ ఇచ్చి చెప్పమంటే, పవన్‌ కల్యాణ్‌ సరిగ్గా చెప్పలేకపోయారట. 'ట్రైనింగ్‌ ఉంటే నేను బాగా చేయగలను' అని కల్యాణ్‌ చెప్పడంతో చిరంజీవి గారికి వెంటనే నా పేరే గుర్తొచ్చింది. ఎప్పుడో పదేళ్లనాడు 'నాటక బృందానికి నేను శిక్షణ ఇస్తాను' అని చెప్పిన విషయం ఆయనకు అప్పటికీ గుర్తుండటమంటే మాటలు కాదు. కల్యాణ్‌కు నటనలో మెలకువలు నేర్పించమని నన్నడిగారు. మెగాస్టార్‌ తమ్ముడికి శిక్షణ ఇచ్చే అవకాశమంటే పెద్ద సవాలే. నన్ను నేను నిరూపించుకోవచ్చు అనిపించింది. మొదట ఓ నెల రోజులపాటు చెన్నైలోనే శిక్షణ ఇచ్చా. కల్యాణ్‌ మొదట్నుంచీ కాస్త సిగ్గరి. అందుకే తరవాత వైజాగ్‌ తీసుకెళ్లి మా బృందంతో కలిపి 'గ్రూప్‌ ఇంటరాక్షన్‌' తరగతులు తీసుకున్నా. తరవాత రాఘవేంద్రరావుగారు కృష్ణగారికి చెప్పి మహేష్‌ని పంపించారు. ప్రభాస్‌ అయితే తనంతట తానే ఇంట్లో వాళ్లకు చెప్పి నా దగ్గరికి వచ్చాడు. మహేష్‌తో కొన్నాళ్లు ప్రయాణించాక 'మీ అబ్బాయి టాప్‌-3లో ఉంటాడు' అని కృష్ణగారితో అంటే పక్కనే ఉన్న ఆయన స్నేహితుడికి కోపమొచ్చింది. కాకా పట్టడానికి చెబుతున్నానేమో అనుకున్నారాయన. ప్రభాస్‌ కూడా చాలా పెద్ద హీరో అవుతాడు అని వాళ్ల అక్కతో అంటే, ప్రభాస్‌ బావ నమ్మలేదు. కావాలని పొగుడుతున్నా అనుకున్నారు. కానీ తరవాతి కాలంలో అదే నిజమైంది. 
  పనికొస్తాడని అనుకుంటేనే...
  • ఒక్క పవన్‌ కల్యాణ్‌కు శిక్షణ ఇస్తే నా బాధ్యత పూర్తవుతుంది అనుకున్నా. కానీ ఒకరి తరవాత ఒకరు కాదనలేని వ్యక్తులు వచ్చారు. అప్పటివరకూ నాకు డబ్బు పైన పెద్దగా ధ్యాసలేదు. ఎవరి బండి మీదో నాటకాలకు వెళ్లేవాణ్ని. ఎవరు ఏది పెడితే అది తినేవాణ్ని. కానీ బాధ్యతలు పెరిగాక డబ్బు పైనా కాస్త దృష్టి పెట్టాల్సొచ్చింది. అందుకే సత్యానంద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని మొదలుపెట్టా. నా అనుభవాల నుంచి అందులో సిలబస్‌ను తయారు చేసుకున్నా. ప్రతి సంవత్సరం అడ్మిషన్ల కోసం వందల ఫోన్లు వస్తుంటాయి. కానీ వ్యక్తిగతంగా వాళ్లతో మాట్లాడి, శిక్షణకు పనికొస్తాడని నిర్థరించుకున్నాకే నా దగ్గర చేర్చుకుంటా. నిజానికి వచ్చిన అందరినీ చేర్చుకుంటే బోలెడు డబ్బులొస్తాయి. కానీ వాళ్లు మంచి నటులు కాలేకపోతే నా పేరు పోతుంది. ప్రముఖుల పిల్లల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంటుంది. వాళ్లకు ఎలాగైనా శిక్షణ ఇవ్వాల్సిందే. ఆసక్తితో నేర్చుకుంటే ఫర్వాలేదు కానీ కొన్నిసార్లు ఎంత చెప్పినా కొందరికి అర్థం కాదు. గట్టిగా చెప్పే పరిస్థితీ ఉండదు. అలాంటప్పుడు తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నా బయటికి చెప్పుకోలేను. కానీ నన్ను నమ్మి వచ్చారు కాబట్టి, ఆలస్యమైనా మంచి ఆర్టిస్టుగా తీర్చిదిద్దాకే అతడిని బయటికి పంపి తరవాత బ్యాచ్‌ను తీసుకుంటా. 
  పేరొచ్చినా... సినిమా ఆడలేదు
  • పవన్‌ కల్యాణ్‌తో మొదలుపెడితే, మహేష్‌, ప్రభాస్‌, రవితేజ, కల్యాణ్‌రాం, వేణు, ఆది, శర్వానంద్‌, వరుణ్‌తేజ్‌... ఇలా ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న కృష్ణగారి మనవడు నవీన్‌తో కలిపి నా దగ్గర శిక్షణ పొందిన ఎనభై మంది నటులు తెలుగు తెరపైన హీరోలుగా కనిపించారు. ఆ మధ్య ఓసారి 'బిల్లా రంగా' అనే సినిమాలో నటించా. నా పాత్రకు పేరొచ్చింది కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ మధ్య 'ఓ క్రిమినల్‌ ప్రేమ కథ'లోనూ కీలక పాత్ర పోషించా. అంతమంది స్టార్లను తయారు చేస్తున్నారంటే ఆయనెంత బాగా నటిస్తారో అన్న అంచనాతో అందరూ ఉంటారు. అందులో ఒక్కశాతం తగ్గినా 'ఆయనకే నటించడం రాదు, ఆయన ఇనిస్టిట్యూట్‌లో ఎందుకు చేర్పించడం' అనుకుంటారు. అందుకే సినిమాల్లో నటించాలంటే కాస్త భయంగా ఉంటుంది. 
  • ఒకప్పుడు మా ఇంట్లో వాళ్లు ఎవరి పెళ్లికైనా వెళ్తే 'మీ నాటకాలోడు ఏం చేస్తున్నాడు' అని ఎగతాళి చేసేవారు. ఇప్పుడు మాత్రం 'మీరు మా ఇంట్లో పెళ్లికి తప్పకుండా రావాలి' అంటున్నారు. నా తోబుట్టువులకు పెళ్లిళ్లు చేసి ఇళ్లు కూడా కట్టించి స్థిరపడేలా చూశా. అందరూ అన్ని మాటలన్నా, దేవుడు ఆ శక్తిని నాకే ఇచ్చాడు. నమ్మిన, నచ్చిన పనిపైన వంద శాతం దృష్టి పెట్టి కష్టపడితే పేరూ, డబ్బూ, హోదా అన్నీ వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. ఇన్నేళ్ల నా ప్రయాణం నాకు నేర్పిన పాఠం అదే.
  ఇంకొంత...
  • వంద మంది హీరోలకు శిక్షణ ఇచ్చాక ఓ పుస్తకాన్ని విడుదల చేసి రిటైర్‌ అయిపోవాలన్న ఆలోచన ఉంది.
  • * మా అబ్బాయి రాఘవేంద్ర త్వరలో రానున్న 'సాహేబా సుబ్రహ్మణ్యం' అనే సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. సహజంగానే వాడిపైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంఎస్‌.నారాయణగారు 'మీ వాడు చాలా ఈజ్‌తో నటించాడు' అన్నప్పుడు నా మనసు కాస్త తేలికపడింది.
  • * పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి 'సత్యానంద్‌గారి దర్శకత్వ శైలి... ఒక పరిశీలన' అనే అంశంపైన ఎం.ఫిల్‌ చేసి పట్టా అందుకున్నాడు. అలాంటి పరిశోధనలో భాగం కావడం నిజంగా అదృష్టం.
   *==============================*

   visiti my website > Dr.Seshagirirao-MBBS.

  2 comments:

  1. Good Information

   Regards,
   editor
   Nowtelugu.com

   ReplyDelete
  2. Very nice sir..We are very proud to have such a great personality in our Visakhapatnam.. very happy to read his experiences and travel..

   ReplyDelete

  Your comment is necessary for improvement of this blog