Tuesday, July 22, 2014

Kanda Mohan-కందా మోహన్


 • పరిచయం (Introduction) : 

మహాత్మాగాంధీ ఆశీస్సులనే మార్గదర్శకంగా అనుసరిస్తూ.. 38 సంవత్సరాలు సివిల్‌ సర్వెంట్‌గా పనిచేసి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు మోహన్‌కందా ఐఏఎస్‌. కేంద్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సభ్యుడిగా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో విభిన్న స్థానాల్లో పనిచేసిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా వ్యవసాయ, అనుబంధరంగాల్లో సేవలందించారు. క్రాప్‌ హాలీడే పై ప్రభుత్వం వేసిన కమిటీకి చైర్మన్‌గా సకాలంలో నివేదిక అందించారు.


''అమ్మా నొప్పులే, అమ్మమ్మా నొప్పులే'' - అన్న పాట, 'పెళ్లి చేసి చూడు' (1952) సినిమా గుర్తున్న వాళ్లందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో పిల్లలు ప్రదర్శించిన చిన్నరూపకంలో- ఈ పాటకి అభనయిస్తూ నటించిన ఆ బాలనటుడు కందా మోహన్‌. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అన మిష పెట్టే కొంటె కుర్రాడి పాత్ర. ఆ పాత్రతో ఎందరికో గుర్తుండిపోయిన అతడే ఉన్నత చదువులు చదివి, ఉన్నత పదవులు చేపట్టి చక్కని కార్యదక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో బాలనటుడిగా కనిపించిన ఇతడు, ఆ తర్వాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన దగ్గరే ముఖ్య అధికారిగా మన్ననలు పొందడం విశేషం.

పెళ్లి చేసి చూడులో దొంగ నొప్పి అభినయిస్తూ మోహన్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. ''పట్టుబట్టినే పాఠాల్‌ చదివితే పరీక్ష నాడే పట్టుకున్నదే.. బడి కెట్టానే వెళ్లేదే'' అని దొంగ మొహంతో నటించి, మోహన్‌ అందరి అభినందనలూ అందుకున్నాడు. తల్లి అయ్యో అని జాలిపడుతూ, ''నీకిష్టం అని గారెలు చేశానే- అయ్యో...'' అని పాడితే, ''కడుపు నొప్పి లేదు- పోయింది'' అని పాట ముగిస్తాడు- ఆ ఏడేళ్ల అబ్బాయి. అంతే! ఆ ఒక్క రూపకంలో పాటతో నటించినా, అప్పట్లో ''ఎవరా అబ్బాయి? ఎవరా అబ్బాయి?'' అని అందరూ ప్రశ్నలు మొదలు పెట్టి పేరు తెలుసుకున్నారు.
ఐతే, మోహన్‌ మొదటి చిత్రం ఇది కాదు. ఎన్‌.వి.ప్రసాద్‌ గారి దర్శకత్వంలో వచ్చిన 'మనోహర్‌' (1954).


 • కెరీర్ : 

మోహన్‌ తండ్రిగారు కందా భీమ శంకరంగారు హైకోర్టు జడ్జిగా పనిచేసేవారు. అబ్బాయి, మద్రాసు నగరంలోనేపుట్టాడు. చురుకూ, ఉషారూ రెండూ కలగలవడంతో- అందర్నీ ఆకర్షించేవాడు. బాలానందం, ఆటవిడుపు రేడియో కార్యక్రమాల్లో న్యాపతి రాఘవరావు గారి ప్రోత్సాహంతో, తరచు పాల్గొనేవాడు. ఆయన పిల్లలచేత నాటికలు ప్రదర్శింపజేస్తే వాటిలో కూడా ధైర్యంగా నటించేవాడు. ఐతే, చిత్ర రంగ ప్రవేశం 'చిత్రం'గా జరిగింది. మైలాపూర్‌లో హిమాలయ కూల్‌డ్రింక్స్‌ అని, ఒక షాపు వుండేది. తెలుగువాళ్లది. అక్కడ చాలా మంది తెలుగు వారంతా చేరి డ్రింక్స్‌ తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు. ఒక సాయంకాలం ఈ 'బాల' మోహన్‌ అక్కడ తెగ కబుర్లు చెప్పి, ఆకర్షిస్తున్న వైనం చూసి, ఎవరో ఇద్దరు ''అబ్బాయి- సినిమాలో వేస్తాదీ?' అని అడిగారు. ''ఓ-పదండి'' అని, వెంటనే దారితీస్తూ వుంటే ''మీ అమ్మ, నాన్నలను అడగొద్దా?'' అన్నారు వాళ్లు. దానికి ఈ గడుగ్గాయి, ''వద్దూ. అడిగితే వద్దంటారు. పదండి- సినిమాలో యాక్టు చేస్తా'' అన్నాడు. 'మనోహర' సినిమాలో 'బాల'రాజు వేషం వుంది. ఈ బాలరాజే పెద్దయ్యాక శివాజీగణేశన్‌ అవుతాడు. తమిళం-తెలుగు-హిందీ భాషల్లో తీశారు. ముందుగా అమ్మతో చెప్పి, ఆమె అనుమతి తీసుకుని చదువులో వున్న మోహన్‌- అలా సినిమాల్లోకి వెళ్లాడు. తర్వాత వాళ్లమ్మగారు నిదానంగా తండ్రిగారితో చెప్పి- ఒప్పించారు. పెళ్లి చేసి చూడు దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌ గారే గనక, మోహన్‌ చేత తొలి వేషం వేయించారు గనక, 'పెళ్లి చేసి చూడు'లోని పాత్రకి మోహన్‌ని తీసుకున్నారు. ఐతే, భారీ చిత్రం, మూడుభాషల చిత్రం గనక 'మనోహర' ఆలస్యంగా విడుదలైంది. 'పెళ్లి చేసి చూడు' ముందుగా విడుదలైంది. ప్రసాద్‌ గారే తాను తీసిన 'పెంపుడు కొడుకు'లో తన కొడుకు వేషం ఇచ్చారు. అలా ఆ 'బాలమోహన్‌' పరదేశి, మరదలు పెళ్లి, రాజయోగం, సంక్రాంతి మొదలైన 28 చిత్రాల్లో నటించాడు. వీటిలో హిందీ, తమిళం కూడా వున్నాయి.


''మరీ సినిమాలే లోకం అయిపోతే, చదువు చెట్టెక్కిపోతుందని మా పెద్దల భయం. నాకు సినిమాల మీద ఉత్సాహం వున్నా, చదువులో వెనకబడలేదు. ఒక దశలో- సినిమాలు ఆపేసి చదువు మీదనే శ్రద్ధ చూపించాను'' అని చెప్పారు మోహన్‌గారు. వాళ్ల నాన్నగారు న్యాయశాఖలో వున్నప్పటికీ మోహన్‌ ఐ.ఏ.ఎస్‌. చదవాలని భావించారు. గుంటూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఆయన చదువు సాగింది. ''ముందడుగు'' (1958) సినిమాలో, మంచి వేషం చెయ్యమని అడిగారు గాని, నేనింక చెయ్యలేదు'' అని చెప్పారు మోహన్‌గారు.


తండ్రిగారికి ఉన్న పట్టుదలంతా, మోహన్‌గారిలోనూ కనిపిస్తుంది. ఐ.ఏ.ఎస్‌. అంతా తండ్రిగారి శిక్షణలోనే జరిగింది. మోహన్‌కి సంగీతం చాలా ఇష్టం. అప్పట్లోనే గిటార్‌ వాద్యం నేర్చుకుని వాయించేవారు- కార్యక్రమాల్లో కూడా. ''అప్పుడు, ఇప్పుడూ'' నేను మంచి సంగీతం వింటాను. పుస్తకాలు చదువుతాను. నిజం చెప్పాలంటే- నేను ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వంలో పని చేసిన దానికంటే, ఇప్పుడు రిటైరయిన తర్వాతనే చాలా బిజీగా వున్నాను. కొన్ని ప్రభుత్వ సంస్థల్లోనూ, ఇతర సంస్థల్లోనూ సలహాదారుగా, సభ్యుడిగా వుండి- తోచిన సలహాలు అందిస్తున్నాను'' అన్నారు మోహన్‌. అప్పుడు మద్రాసు నుంచి గుంటూరు, మళ్లీ మద్రాసు- అలా తిరగడంలో నటనకి అవకాశం కుదరలేదు. అంతే. సినిమాలు లేవు, నాటకాలూ లేవు. ఐఏఎస్‌ అయ్యాక, చాలా వూళ్లలో సబ్‌కలెక్టర్‌గా, జిల్లా కలెక్టర్‌గా, కొన్ని ముఖ్య శాఖలకి కమిషనర్‌గా ఉద్యోగాలు చేశారు ఆయన. కేంద్ర ప్రభుత్వంలోని శాఖల్లో పనిచేస్తున్నా సొంత రాష్ట్రానికి వెళ్లాలన్న కోరిక వుండేది ఆయనకి. సరిగ్గా ఆ సమయంలోనే ఆంధ్రదేశంలో ప్రభుత్వం మారిపోయింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి, ఎన్‌.టి.రామారావు గారు ముఖ్యమంత్రి అయారు. ''మోహన్‌ కందా మన రాష్ట్రానికి వస్తున్నారుటగా- మా ఆఫీసులో వెయ్యండి'' అన్నారుట రామారావు గారు. 'పెళ్లి చేసి చూడు'లోని హీరో- రాష్ట్రంలో హీరో! ఆనందంగా ఇద్దరూ కలుసుకున్నారు. ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జనార్ధన్‌రెడ్డి గారి దగ్గరా, మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర, రామారావు గారి దగ్గరా, రాజశేఖర్‌రెడ్డి గారి దగ్గరా- ఇలా ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు ఆయన. అందరి మాట ఎలా వున్నా, ''రామారావు గారి దగ్గర పనిచెయ్యడం ఒక అనుభూతి'' అని చెబుతూ ''ఆయనకి అర్థరాత్రి దాటిన రెండు గంటలకే తెల్లవారు ఝాము వచ్చేది. అది ఆయన సినిమా అలవాటు. రెండు గంటలకి లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, యోగాసనాలు, జపాలూ ముగించుకుని తెల్లవారకుండానే నాలుగు గంటలకి ఆఫీసులో కూచునే వారు. (సినిమాల్లో నటిస్తున్నప్పుడు, ఉదయం ఆరు గంటలకే ఫుల్‌ చికెన్‌ తినేవారని చెప్పుకునేవారు). నాలుగు, నాలుగున్నర గంటల మధ్య ఆయన దగ్గర్నుంచి ఏ క్షణంలోనైనా ఫోన్‌ రావచ్చు- కాబట్టి నేను సిద్ధంగా వుండేవాడిని. ఇలాంటి అనుభవం ఇంకే ముఖ్యమంత్రి దగ్గర లభించదు. ఉద్యోగ ధర్మం ఉదయం 10, 11 గంటల తర్వాతే'' అని చెప్పారు మోహన్‌. 'పెళ్లిచేసి చూడు' నాటిక అబ్బాయి గనక, రామరావు గారు ఆ చనువుతోనే పిలిచేవారు.
మోహన్‌కందా గారికి తెలుగు, ఆంగ్ల భాషలతో పాటు హిందీ, ఉర్దూ భాషలు కూడా క్షుణ్ణంగావచ్చు. కొన్ని విదేశీయ భాషలు వచ్చు. ''చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఐన తర్వాత- ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తారా? అని ఆయనే అడిగారు. అలా నేను ముఖ్య కార్యదర్శిగా పదవి చేపట్టి- కొనసాగాను'' అన్నారు మోహన్‌.

''ముఖ్య కార్యదర్శి పదవి అంటే ముళ్లకిరీటం లాంటిది. ఎన్నెన్ని సమస్యలు! ఎన్నెన్ని విమర్శలు! ఎన్నెన్ని ఆక్షేపణలు! అన్నీ ఎదుర్కొంటూ, సవ్యమైన పాలన అందించడానికి తోడ్పాటు అందించాలి. నేను పనిచేసిన అందరు ముఖ్యమంత్రుల తీరు ఒక్కలా వుండదు. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన; ఒక్కో విధానం'' అన్నారు మోహన్‌ కందా.

కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి హోదాలో ఆయన అనేక దేశాలు పర్యటించారు; ఎందరెందరో విదేశీయ ప్రముఖుల్ని కలుసుకున్నారు. ''అదే పెద్ద ఎడ్యుకేషన్‌'' అంటారాయన. ఎక్కడ ఏ అవాంతరం జరిగినా, ఏ ప్రమాదం జరిగినా హటాహుటిన జరగవలసిన ఏర్పాట్లన్నీ కార్యదర్శి చూసుకోవాలి. లోపాలు రాకూడదు. అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. పెద్ద గొప్ప బాధ్యత!

''వివిధ రాజకీయ రంగ ప్రముఖులతో, అనేక శాఖలతో కలసి పనిచేయడం గొప్ప అనుభవం. అదంతా నా అదృష్టం! సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలడానికి పెద్ద అవకాశం. నా జీవితం నాకు నేర్పిన ముఖ్యమైన పాఠం అదే'' అంటారు మోహన్‌.

ఒకనాడు బాలనటుడై ప్రకాశించిన మోహన్‌కందాకు, ఇవాళ్లి సినిమాల మీద అవగాహన లేదు. 'సినిమా కూడ కలుషితమై పోయినట్టు అనిపిస్తుంది' అంటారాయన ''అలాగే సంగీతమూ''.

బాలనటులు క్రమేణా ఎదిగి చిత్రాల్లో నాయకులైన వాళ్లున్నారు. కాని, ఒక బాలనటుడు- ఉన్నత విద్యలు అభ్యసించి- ఉన్నత పదవిని నిర్వహించిన ఘనత- మోహన్‌ కందా గారి దగ్గరే కనిపిస్తుంది! జీవిత విశేషాలు (profile) : 
 • పేరు : మోహం కందా, 
 • పుట్టిన తేదీ : 04-సెప్టెంబర్ -1945,
 • పుట్తిన ఊరు : చెన్నై, 
 • తండ్రి : కందా భీమ శంకరంగారు హైకోర్టు జడ్జి,
 • తల్లి : వెంకమ్మ ,మాణిక్యాంబ ( పాపాయమ్మ సామాజిక సేవకురాలు),
 • తోబుట్టువులు : పదిమంది సంతానంలో నేను చివరివాడిని. అన్నయ్య, అక్కయ్య, నేను మాత్రమే బతికాం.తనమాటల్లో.
 • చదువు : ఎం.ఎస్సీ తరువాత ప్యారిస్‌కు వెళ్లి పరిశోధన పూర్తి చేయాలని  అభిమతం. ఆ మేరకు పిహెచ్‌.డిలో రెండు పేపర్స్‌ కూడా సమర్పించాను. అప్పటికే సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతూ.. పరీక్షలు రాసాను. నాన్నేమో సివిల్స్‌కే ప్రాధాన్యత అనే వారు. ఈ లోగా ఎస్‌.బి.ఐ.లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే సివిల్స్‌ ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. అలా నాన్న  మాట ప్రకారమే సివిల్స్‌లో చేరాను.
 • భార్య్ : ఉషా ,


నటించిన కొన్ని సినిమాలు (filmography ):

 • 'పెళ్లి చేసి చూడు'-- (1952),
 • 'మనోహర్‌' (1954),
 • 'పెంపుడు కొడుకు',
 •  'బాలమోహన్‌' 
 • పరదేశి, 
 • మరదలు పెళ్లి, 
 • రాజయోగం, 
 • సంక్రాంతి ,

మొదలైన 28 చిత్రాల్లో నటించాడు. వీటిలో హిందీ, తమిళం కూడా వున్నాయి.

 • సితారసహకారంతో..రావి కొండలరావు పాతబంగారం @ ఈనాడు సినిమా-22/07/2014

 •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS. 

2 comments:

 1. CPM నాయకుడు ఏచూరి సీతారాం , కందా మోహన్ గారి మేనల్లుడు

  ReplyDelete
 2. ఛాలా బాగా చెప్పారు
  News4andhra.com is a Telugu news portal and provides
  Telugu Movie News, Latest and Breaking News on Political News and Telugu Movie Reviews at one place

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog