Master Viswam-మాసటర్ విస్వం










పరిచయం (Introduction) :


మొదటి బాలతారల కథ!-- మాసటర్ విస్వం -రావి కొండలరావు గారి సౌజన్యముతో..

  • 'నేను జగ్గయ్యపేటలో ఉన్నప్పుడు, మాయింటికి ఎదురుగా 'బాలనాగమ్మ'లో నటించిన విశ్వం తల్లితండ్రులుండేవారు. విశ్వం అప్పుడు బాలనటుడిగా సినిమాల్లో నటిస్తున్నాడు. మావూరి వాళ్లందరికీ విశ్వం పెద్ద ఆకర్షణ. నేనూ విశ్వాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఆతర్వాత వాళ్లు నల్గొండకి మారారు. విశ్వం తండ్రిగారి పేరు ఉప్పల పుల్లయ్య. నల్గొండలో ఆయన హోటల్‌ నడిపేవాడు. ఒకసారి విశ్వం నల్గొండ రాగా, ఊరు వూరంతా అతన్ని చుట్టుముట్టింది. మానాన్నగారు జ్యోతిష్యం చేప్పేవారు. పుల్లయ్యగారికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉండడం వల్ల మానాన్న గారు, ఆయన దగ్గర మిత్రులయ్యారు. నేనూ, విశ్వం దాదాపు సమ వయస్కులం. ఐతే నేను కాస్త పెద్ద. మేమిద్దరం స్నేహితులమయ్యాం. విశ్వం మాద్రాసులోని స్టూడియోలు, నటీనటులు, షూటింగుల గురించి చెబుతూ ఉంటే, ఆసక్తిగా వినే వాడిని. నేనూ సినిమా ప్రయత్నాలు చెయ్యడానికి విశ్వం ప్రేరణ బాగా వుంది''.


-ఇలా రాసుకున్నది సుప్రసిద్ధ చలన చిత్రనటుడు - టి.ఎల్‌.కాంతారావు, ఈ విశ్వం ఎవరు? ఆరోజుల్లో అతనికి ఎందుకంత గ్లామరొచ్చింది?ఎందుకు ''స్టార్‌క్రేజ్‌'' వచ్చింది?
మాస్టర్‌ విశ్వం 1942లో వచ్చిన జెమిని వారి 'బాలనాగమ్మ'లో బాలవర్థిరాజుగా నటించాడు. నిజానికి బాలవర్థిరాజే ఆ సినిమాలో హీరో. బాలహీరో. మాయల మరాఠీ అతని తల్లిని చెరబట్టాడు. తండ్రిని రాయిగా మార్చాడు. కొడుకు తండ్రిని, తల్లినీ చూడాలి. తల్లిని విడిపించాలి! తండ్రిని మళ్లీ మనిషిని చెయ్యాలి. ఈ బృహత్క్‌ర్యాలు సాధించడానికి బయల్దేరి, అన్నీ విజయవంతంగా సాధించి, మాయల మరాఠీని హతం చేసి వస్తాడు గనక, అతనే నాయకుడు. 'బాలనాగమ్మ' ఘనమైన విజయం సాధించింది. పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా విజయవిహారం చేసింది. దాంతో, ఆ బాల హీరో, పెద్ద హీరోలకి అసూయ కలిగేంత క్రేజ్‌స్థాయికి ఎదిగాడు. విశ్వం ఏ వూరు వెళ్తే ఆ వూళ్లోని జనం చుట్టుముట్టేవారు. నాకు 12, 13 ఏళ్లప్పుడు, 'బాలనాగమ్మ'సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. గోవిందరాజు సుబ్బారావు మాయలమరాఠీ. మహా అద్భుతమైన నటన, భయంకరంగా వుండేవాడు. కాంచనమాల, పుష్పవల్లిలాంటి గ్లామర్‌ తారలున్నారు. ఇవన్నీ కాక, టెక్నికల్‌గా 'బాలనాగమ్మ'ను అద్భుతంగా తీశారు. మాంత్రికుడి క్షుద్రపూజా మందిరం ఒక్కటిచాలు! (ఆయసులో వున్నవాళ్లం విశ్వానికి లేఖలు రాయాలని, రునామా కోసం ప్రయత్నించంగాని, ఎలా దొరుకుతుంది?!)

విశ్వం 1932లో జగ్గయ్యపేటలో పుట్టినా, నల్గొండలోనే స్థిరపడ్డారు. విశ్వం తండ్రి పుల్లయ్య గారికి సంగీతం మీద ఎనలేని ప్రేమ. ఆ ప్రేమతో, తనకి వంటబట్టక పోయినా, కొడుకుకైనా సంగీతం నేర్పించాలని పట్టుబట్టి, మందపాటి వెంకట్రాజుగారు అనే విద్వాంసుడి దగ్గర సంగీతం నేర్పించారు. విశ్వం హార్మోనియం వాయించడం కూడా నేర్చుకున్నాడు. కర్ణాటకం, హిందుస్థానీ రెండు అభ్యసించాడు. త్యాగరాయకృతులు నేర్చుకున్నాడు.

అలా వుండగా, ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌ దర్శకత్వంలో భవానీపిక్చర్స్‌ వారు 'చండిక' (1940) మొదలుపెడతూ, అందులోని బాలపాత్రకి అబ్బాయిల కోసం వెతుకుతున్నారు. ''బాలనటుడు కావలెను'' అనే ప్రకటన కూడా పత్రికల్లో రాగా, విశ్వం తండ్రి 'చూద్దాం' అని దరఖాస్తు పెట్టారు. ఆ రోజుల్లో అందచందాల మాటేంకేంగాని పాట, పద్యం రావాలి. ఆ రెండూ రాకపోతే ఎంత అందమైన వాళ్లయినా అనర్హులే. అంచేత, విశ్వాన్ని రమ్మని భవాని వారు పాట విని, వేషం ఇచ్చారు. ఇందులో అతను 'రాచపుట్టువునకు రణమందు మృతికన్న భాగ్యమేమి?' అన్న పద్యం చదువుతూ నటించాడు. ఐతే, ఆ అబ్బాయి పేరు విశ్వనాథం. భవాని పిక్చర్స్‌వారే విశ్వం అనిపేరు మార్చి, 'మాస్టర్‌ విశ్వం' అని వేశారు. కన్నాంబ, బళ్లారి రాఘవ, వేమూరి గగ్గయ్య మొదలైన పెద్దలతో పరిచమైంది. వారి ద్వారా 'భూకైలాస్‌' (1940) తీస్తున్న ప్రగతి పిక్చర్స్‌ వారు, గణేశుడి వేషం వెయ్యడానికి పిలిపించారు. ఇది గోకర్ణం స్థల పూరాణం కథ. సుందరరావు నడకర్ణి దర్శకుడు. మద్రాసులోని ప్రగతి స్టూడియోలోనే నిర్మించారు.

ఐతే ఇందులో ఎక్కువగా కన్నడ నటులు. ఈ సినిమా రెండు భాషల్లో తీశారు. కన్నడం, తెలుగు. రాయప్రోలు సుబ్రహ్మణ్యం (యేగివేమన, త్యాగయ్య చిత్రాల్లో నటించారు) శంకరుడు. సుబ్బయ్యనాయుడు రావణుడు. రావణుడు శివుడి ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, వినాయకుడు గణపతి భట్టుగామారి, ఆత్మలింగాన్ని సముద్రపు ఒడ్డున పెట్టిస్తాడు. ఆపాత్రలో విశ్వం-ఆవుల్ని తోలుతూ 'పొద్దూకి పోయింది పోరె' అన్నపాట, 'దారి యేదో చూచుకోరా' అన్నపాటా పాడాడు. ఓడియన్‌ రికార్డుల్లో కూడా అతనే పాడాడు. ఆ తర్వాత జెమినివారి 'బాలనాగమ్మ' (1942),
జీవన్ముక్తి(1942), చిత్రాల్లో నటించాడు. 'జీవన్ముక్తి'లో సూరిబాబు, విశ్వం కలిసి పాడిన 'జోడు కొంటారా బాబూ' అన్నపాటని ఆరోజుల్లో అందరూ పాడుకునే వారు. 'బాలనాగమ్మ'లో పాటలు, పద్యాలు ఉన్నాయి. రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. దాదాపు నెలరోజుల పాటు కూచోబెట్టి, పద్యాలు, పాటలూ నేర్పారు. ఐతే, బాలవర్థిరాజు పాత్రలో విశ్వం అందంగానూ, ఆకర్షణీయంగాను కనిపించాడు. చక్కగా నటించాడు కూడా. దర్శకుడు సి.పుల్లయ్య రోజూ రిహర్స్‌లు చేయించే వారు. మాంత్రికుడి ప్రాణం సప్తసముద్రాల అవతల వున్న మహారణ్యంలోని ఒక వృక్షం తొర్రలో వున్న చిలుకలో ఉంటుంది. అక్కడ వున్న సర్పాన్ని రాక్షసున్నీ ధైర్యంగా ఎదుర్కొని చిలుకను తీసుకుని వచ్చి మాయలమరాఠీ ఎదుటే కాలు, చెయ్యి విరిచేస్తూ హతమారుస్తాడు. ఇదంతా చెప్పడం ఎందుకంటే, బాలవర్థిరాజు, మరాఠీ ఒక్కో ప్రాణం హరిస్తూ చంపుతున్నప్పుడు అతని నటనకు ప్రేక్షకులు చప్పట్లుచరిచేవారు, ఈలలు కొట్టేవారు.
ఆ తర్వాత మళ్లీ అంతటి ప్రాముఖ్యంగల బాలపాత్రలు రాలేదు, విశ్వాన్ని పిలవనూ లేదు. విశ్వానికి 14, 15 ఏళ్లు వచ్చేసరికి, తండ్రిగారు పోవడంతో కుటుంబనిర్వహణ అతనిమీదే పడింది. విశ్వం చక్కని చిత్రాలు వేసేవాడు. ఆయిల్‌ పెయింటింగ్స్‌. ఆ చిత్రాలు వేయడం, అవి అమ్మడం ధన సంపాదన చెయ్యడంలో సినిమా ప్రయత్నాలకు కుదరలేదు. తీరా సినిమా అవకాశాలు వచ్చినప్పుడు విశ్వానికి కుదరలేదు. సంగీతం వచ్చును కాబట్టి సంగీతసాధన బాగా చేసి, పాడేవాడు. నేర్పేవాడు. హార్మోనీ వాయిస్తూ పాటలు పాడుతూ, కచేరీలు చేశాడు.ప్రతిభావారు 'సీతారామజననం' (1944) మొదలుపెడతూ రామలక్ష్మణుల పాత్రలకి అన్వేషణ సాగిస్తున్నప్పుడు విశ్వాన్ని పిలిపించి, మేకప్‌ వేసి పరీక్షించారు. చిన్నవాడనో, పాత్రకి సరిపోలేదనో-అతన్ని ఎన్నిక చెయ్యలేదు. విశ్వం ప్రైవేట్‌గా చదువుతూ ఎమ్‌.ఎ. చేసి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఊళ్లలో లెక్చరర్‌గా పనిచేశారు.

పెద్దవాడై, ఉద్యోగం చేస్తున్నాకూడా 'బాలనాగమ్మ' గుర్తున్నవాళ్లు - ఆ విషయాలు అడుగుతూ, అతని దగ్గర సంతకాలు తీసుకునేవారు. విశ్వం ఇంగ్లీషు, తెలుగు భాషలతో పాటు హిందీ కూడా నేర్చుకున్నారు. ఉద్యోగం చేస్తున్నా, సంగీతం మానలేదు. తను రాసిన పాటలకి తనే వరసలు కల్పించుకుని పాడుతూ ఉంటే విని, ఆకాశవాణి వారు పిలిచి, రేడియోలో పాడించుకునేవారు. హైదారాబాద్‌ రేడియోలో సి.నారాయణరెడ్డి, దాశరథి రాసిన చాలా పాటలకి తానే స్వరంకట్టి పాడేవారు. రేడియో గాయకుడిగా పేరొచ్చింది.
విశ్వానికి ముగ్గురు అమ్మాయిల తర్వాత, ఒక అబ్బాయి. ఈ అబ్బాయి పేరు శ్రీనివాస్‌. కోదాడలోని బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఉద్యోగి. (ఈ వ్యాసంలోని కొన్ని విషయాలు ఆయనే తెలియజేశారు) తన 72వ ఏట-2004లో 'మాస్టర్‌ విశ్వం' (పెద్దయినా కూడా మాస్టరుగానే పిలవబడ్డాడు. ఎంచేతంటే లెక్చరరు, సంగీతం మాస్టారూ) మరణించారు.


  • విశేషంగా చెప్పవలసిందేమిటంటే - బాలతారలకి కూడా ప్రేక్షకారాధన ఉంటుందని. అలాంటి ఆరాధన పొందిన బాలిక - 'బాలయేగిని' (1937)లో నటించిన బేబిసరోజ. ఆసినిమా ద్వారా సరోజకి ఖ్యాతి కలిగింది. సరోజ చిత్రం ఉన్న లెండర్లు చాలామంది ఇళ్లలో కనిపించేవి! అలా ప్రేక్షకుల మెప్పుపొందిన మొదటి బాలిక - బేబిసరోజ. మొదటి బాలుడు మాస్టర్‌ విశ్వం.



 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : మాస్టర్ విస్వం ,
  • పుట్టిన ఊరు : జగ్గయ్య పేట ,
  • పుట్టిన తేదీ : *-*-1932,
  • తండ్రి : పుల్లయ్య ,



నటించిన సినిమాలు (filmography ): 

  • 'చండిక' (1940),
  • 'భూకైలాస్‌' (1940),
  • బాలనాగమ్మ (1942).
  • జీవన్ముక్తి(1942),


Courtesy with : patha bangaram@eenadu cinema news paper/Ravi kondalarao

  • ============================

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

  1. I can give some more information on Master Viswam, 09441481014

    ReplyDelete
  2. శ్రీ గారికి ధన్యవాదములు . సమాచారము నా మెయిల్ ..seshagirirao_vandana@yahoo.com కి పంపించండి .

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)