Naveena, నవీన


పరిచయం (Introduction) :


  • అలౌకికతో అలరించి, 'చంద్రముఖి'లో మేనకగా మెరిసి ప్రేక్షకులకు దగ్గరైంది చిన్ని తెర నటి నవీన. నటిగా, యాంకర్‌గానే కాదు సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు చేసి నిర్మాతగానూ మారిన నవీన అంతరంగమిది.
జీవిత విశేషాలు (profile) :
  • మాది చీరాల. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేను చిన్నదాన్ని. చిన్నప్పుడు డాక్టర్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. అయితే పదోతరగతిలో ఉన్నప్పుడు 'నువ్వు సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా' అని మా ఎదురింట్లో ఉండే ఒకాయన అన్నారు. ఫొటోలు తీయించి స్టూడియోలకూ, దర్శకులకూ పంపారు. పదో తరగతి పరీక్షలు రాశాక అవకాశాల కోసం అమ్మను వెంటబెట్టుకొని వెళ్లా. వెళ్లిన చోటల్లా నిరాశే. ఒకసారి ఓ టీవీ సీరియల్‌ ఆడిషన్‌కి వెళ్లా. 'నటన రానివాళ్లంతా ఎందుకొస్తారు' అని దర్శకుడు నా ముందే అన్నాడు. కృష్టవంశీగారు 'చిన్నదానివి వెళ్లి బాగా చదువుకో' అని తిప్పి పంపారు. బాధగా వెనక్కి వచ్చి ఇంటర్‌లో చేరా. అప్పుడే ఓ స్టూడియోలో నా ఫొటోలు చూసిన దర్శకుడు శ్రీరామ్‌ బాలాజీ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. 'వీరివీరి గుమ్మడి పండు', 'అవునంటే కాదనిలే' సినిమాల్లో నటిగా కనిపించా. కానీ నటిగా వెండి తెరమీద వెలగాలంటే చాలా కష్టం. అది నావల్ల కాదనీ నటించాలనే ఆలోచన మానేశా. ఇంటర్‌ పూర్తయింది డిగ్రీలో చేరాలనుకొంటుంటే రాఘవేంద్రరావుగారి ఆధ్వర్యంలో 'అలౌకిక' అనే సోషియో ఫాంటసీ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ నాకిచ్చారు.


కెరీర్ :


  • చాలా భయపడ్డా: మొట్టమొదటి సీరియల్‌, అదీ అలౌకిక టైటిల్‌ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే ఒక ఎపిసోడ్‌లో పాము నామీద పాకే సీన్‌ ఉంటుంది. అందుకోసం ఒక పాముని తెచ్చి ప్రాక్టీస్‌ చేయమన్నారు. నాకు బల్లులంటేనే భయం. అలాంటిది పాముతో ప్రాక్టీస్‌ అంటే ఏడుపొచ్చింది. మరోవైపు ఆ సీన్‌ చేయనంటే ఏమంటారోనని భయం. ప్రాక్టీస్‌ చేయకుండానే కళ్లుమూసుకొని కూర్చొన్నా. ఇక ఆ రోజే జీవితంలో చివరి రోజనుకొని సీన్‌కి సిద్ధమైపోయా. సెకనులో అది నామీద నుంచి పాకి వెళ్లిపోయింది. దాన్నుంచి దుర్వాసన. ఒళ్లు గగుర్పొడించింది. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అప్పట్నుంచి సీరియల్‌ ఒప్పుకొనే ముందు ఇలాంటి సాహసాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నా.



  • వ్యాఖ్యాతనయ్యా: ఏడాదిపాటు ప్రసారమైన అలౌకికలో నటించడం వల్ల జీతెలుగులో యాంకర్‌గా అవకాశం ఇచ్చారు. నేను చేసిన కార్యక్రమాల్లో చెప్పుకోదగింది 'తారలు దిగివచ్చిన వేళ'. ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళ ప్రముఖులు ఎనిమిది వందల మందిని ఇంటర్వ్యూ చేశా ఒక్క రజనీకాంత్‌ గారిని తప్ప. నాకు అవకాశం ఇవ్వని దర్శకుడు కృష్ణవంశీగారిని అయితే నాలుగు సార్లు ఇంటర్వ్యూ చేశా. చేసిన ప్రతిసారీ ఆయన నన్ను రిజెక్టు చేసిన విషయం ప్రస్తావిస్తూ ఉంటారు.

  • ఇంట్లో ఒప్పుకోలేదు: అగ్నిగుండం, మల్లీశ్వరి సీరియళ్ల తరవాత 'త్రిశూలం'లో అవకాశం వచ్చింది. దాని దర్శకుడు రాఘవేంద్రరావుగారి శిష్యుడు యాటా సత్యనారాయణ. అంతేకాదు నటించడానికి పనికి రానని గతంలో నా ముందే తిట్టిన వ్యక్తి కూడా అతనే. ఈ సీరియల్‌లో మాత్రం నన్ను బాగా మెచ్చుకున్నారు. తరవాత ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకుందామనుకొన్నాం. నాన్న ఓకే అన్నా, అమ్మ మాత్రం ఒప్పుకోలేదు. నెల రోజుల పాటు తనని సవాలక్ష ప్రశ్నలతో వేధించింది. సొంత ఇల్లు కూడా లేని వ్యక్తితో పెళ్లేమిటంటూ గట్టిగా అడ్డు చెప్పింది. అప్పుడు ఇద్దరం కలిసి పొదుపు చేసి ఇల్లూ, కారూ, సామగ్రి కొనుక్కున్నాం. రాఘవేంద్రరావుగారూ ఆర్థికంగా అండగా నిలిచారు. మావారింట్లో మాత్రం ఎలాంటి సమస్యా లేదు. మా బంధువులు కూడా 'సినిమా వాళ్లతో సంబంధం కలుపుకోవడం మంచిదికాదమ్మా! ఆలోచించూ' అనేవారు. ఆయన వ్యక్తిత్వం మీద నాకు స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపా. చివరికి నిశ్చితార్థానికి అక్కాబావలు మాత్రం రానన్నారు. రాఘవేంద్రరావు గారే మా పెద్దవాళ్లకు భరోసా ఇచ్చి, మా వివాహం జరిపించారు. మా పెళ్లి అయ్యేప్పటికి ఆయన 'చంద్రముఖి'కి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లయిన ఏడాదికి బాబు పుట్టాడు. నాన్న చనిపోవడంతో అమ్మ నా దగ్గరకు వచ్చేసింది. ఎంతైనా మధ్యతరగతి మనుషులకు ఇద్దరి సంపాదనా అవసరం. అందుకే నేను నటించాల్సి వచ్చింది. బాబుని అమ్మ చూసుకోవడంతో చంద్రముఖిలో నటించడానికి ఒప్పుకొన్నా. ఆ పాత్రతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాను.



  • నిర్మాతగా మారా: చేసింది తక్కువ సీరియళ్లు అయినా నటిగా మంచి పేరు సంపాదించుకున్నా. ఆయన ఎలాగూ దర్శకుడు. అందుకే నేనే నిర్మాతగా మారి సొంతంగా సీరియళ్లు తీస్తే బాగుంటుందనిపించింది. అలా 'కలవారి కోడళ్లు' ప్రారంభించాం. అందులో నేనూ నటిస్తున్నా. మొదట్లో నాది నెగిటివ్‌రోల్‌. చాలామంది ఫోన్‌ చేసి 'రేఖా అలా చేస్తున్నావేంటి' అనేవారు. నిర్మాతను నేనే కాబట్టి ఆ పాత్ర స్వభావం సరదాగా ఉండేలా మార్చా. ఇక, 'పెళ్లినాటి ప్రమాణాలు' కూడా నా ప్రొడక్షన్‌లోనే వస్తోంది. ప్రస్తుతం నేను అకౌంట్స్‌ కోసం వేరే వాళ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. నా ప్రొడక్షన్స్‌కు సంబంధించి లెక్కలు స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో దూర విద్య ద్వారా బీకామ్‌ చేస్తున్నా. నాకూ, మావారికీ సినిమా తీయాలనే ఆలోచన ఉంది. ఓ మంచి కుటుంబ కథా చిత్రంతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాం.

  • ======================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala