Kalpana Raghavendrarao, కల్పన రాఘవేంద్రరావు (singer cum actress)

  •  
  •  

పరిచయం (Introduction) : 
  

 కల్పన... 'ముసుగు వేయొద్దు మనసు మీదా' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన గాయని. ఆమె ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా పాడతారు. ఆమెలో అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. సమస్యలకు జడిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్న పిరికితనం, అదే సమస్యపై పోరాడి విజేతగా నిలిచిన మొండితనం. సంగీతం, నాట్యం, చదువూ, బహుభాషా ప్రావీణ్యం... ఇలా సకల కళల కలబోత కల్పన తన ప్రస్థానం గురించి వివరిస్తున్నారిలా....

'పాట ఏదైనా సరే దాని అర్థం, ఉచ్ఛారణ తెలీకుండా పాడితే అది అర్థరహితంగా ఉంటుంది' ఇది మా నాన్న నాకు చెప్పిన మాట. తమిళమ్మాయినైనా ఇప్పుడు మీతో ఇంత చక్కగా తెలుగు మాట్లాడటానికి కారణం ఆ మాటే. నాకు తెలుగు రాయడమూ, చదవడమూ వచ్చు. మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌, స్పానిష్‌, ఇటాలియన్‌, జర్మనీ, అరబిక్‌ భాషలూ వచ్చు. ఇన్ని భాషలు నేర్చుకోవడానికి కారణం సంగీతమే. ఏ భాషలోనైనా పాట అర్థం తెలీకుండా నేను పాడలేను. అదే నేను ఇన్ని భాషలు నేర్చుకునేలా చేసింది. నిజానికి నా ప్రస్థానం ప్రారంభమైంది గాయనిగా కాదు నటిగా. మూడన్నరేళ్ల వయసులోనే సినిమాల్లో నటించాను. మలయాళంలో 'ఈనాడు' నా తొలిసినిమా. ఐదేళ్లు వచ్చాక కొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటించాను. బాలకృష్ణ నటించిన 'సీతారామకల్యాణం'లో నేను కనిపిస్తాను. ఓ రకంగా నేను సంగీత, సినీ ప్రపంచంలోనే పుట్టిపెరిగానని చెప్పొచ్చు. ఇంట్లో అమ్మానాన్న, అమ్మమ్మ ఇలా అంతా సినిమా, సంగీత నేపథ్యం ఉన్నవాళ్లే. నాన్న టీఎస్‌ రాఘవేందర్‌ కర్ణాటక సంగీత విద్వాంసుడే కాకుండా సినీ సంగీత దర్శకుడు కూడాను. అమ్మ సులోచన కూడా గాయనీమణే. అందరూ నాన్న చేతివేలు పట్టుకుని నడిస్తే నేను ఆయన నేర్పిన సరిగమలను పట్టుకుని పెరిగాను. ఐదేళ్ల వయసులోనే నాన్నతో కలిసి స్టేజిపైన పాడాను. అలా నాకు సంగీతంపైన చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. నా ఆరో ఏట సాలూరు రాజేశ్వరరావు తనయుడు సాలూరు వాసురావు తొలిసారి నాతో ఒక తెలుగు సినిమాలో 'చల్‌ చల్‌ గుర్రం' అనే పాటను మనో అంకుల్‌, సుశీలమ్మలతో కలిపి పాడించారు. ఆ సినిమా పేరేంటో గుర్తులేదు. ఇక రెండో పాట కూడా తెలుగులోనే. రాజ్‌-కోటి అంకుల్‌ వాళ్లు పాడించారు. చిత్రమ్మతో కలిసి 'అనగా రాజు' పాట పాడాను. ఆ సినిమా పేరూ తెలీదు. పాటలు పాడుతూనే బాల నటులకు డబ్బింగ్‌ చెప్పేదాన్ని. బుల్లితెర నటి సుజితకు అప్పట్లో సినిమాలకు నేనే గాత్రదానం చేసేదాన్ని. అలా నా బాల్యమంతా సినిమాలూ, పాటలూ, డబ్బింగ్‌ అంటూ క్షణం తీరిక లేకుండా ఉండేది. నా బాల్యం ఎప్పుడు గడచిపోయిందో కూడా నాకు గుర్తులేదు. బొమ్మలతో ఆడుకున్న జ్ఞాపకాలేవీ లేవు. 25 సినిమాల్లో నటించి ఉంటాను. పనిభారం పెరగడంతో డబ్బింగ్‌, నటనకు స్వస్తి పలికేశాను. ఇక నేను పెద్దదాన్ని అయ్యాక నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైందీ తెలుగు సినిమాతోనే. 1999లో మణిశర్మగారికి మా నాన్న నన్ను పరిచయం చేశారు. 'మనోహరం' సినిమాలో 'మంగళగౌరికి మనసున్న శివుడికి...' పాట ఆయన నాతో పాడించారు. నేను తెలుగు నేర్చుకోవడానికి ఈ సినిమా కూడా ఒక కారణం. తెలుగు భాషపై పట్టు పెంచుకోవాలని నాన్న ఇచ్చిన సలహాతో అప్పల నరసయ్య మాస్టారు వద్ద తెలుగు నేర్చుకున్నా. చదవడం, రాయడం రెండు నెలల్లో వచ్చేసింది. మాట్లాడటానికే ఐదేళ్లు పట్టింది. మణిశర్మ వద్ద ఉన్నప్పుడే దేవీశ్రీప్రసాద్‌ అన్నయ్యతో పరిచయమైంది. ఆయన 'ఆనందం' సినిమాలో మోనాలిసా పాట పాడించారు. తరవాత 'కలుసుకోవాలని' సినిమాలో పాడించిన 'చెలియా చెలియా సింగారం' మంచి హిట్‌ అయింది. నిజానికి అది నేను కాదు పాడాల్సింది. నన్ను కేవలం ట్రాక్‌ పాడటానికి దేవీఅన్న పిలిచారు. తరువాత నా గొంతు నచ్చి ఈ పాట నువ్వే పాడు అంటూ అవకాశం కల్పించారు. తరువాత తెలుగులో వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఖడ్గంలో 'ముసుగు వేయొద్దు మనసు మీద..', ఇంద్రలో 'అమ్మడు అప్పచ్చి...' అంజిలో 'అమ్మో మీయమ్మ గొప్పదే...' లాంటి పాటలు నాకెంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకూ నేను దాదాపు వెయ్యికిపైగా పాటలు పాడితే అందులో ఒక్క తెలుగులోనే నాలుగు వందలకుపైగా పాడాను. సంగీతంలో నాకు అరబిక్‌ స్త్టెల్‌, వెస్ట్రన్‌ క్లాసికల్‌ కూడా ఇష్టం. నా చెల్లెలు వెస్ట్రన్‌ క్లాసికల్‌ సంగీతంలో మాస్టర్స్‌ చేసింది. తను ఎనిమిదో గ్రేడ్‌ పరీక్ష రాస్తున్నప్పుడు నాకు ఆ సంగీతంపైన ఆసక్తి ఏర్పడింది. ఈ సంగీతంపైన నాకున్న పిచ్చితోనే స్పానిష్‌, జర్మనీ, ఇటాలియన్‌, అరబిక్‌ భాషలూ నేర్చుకున్నా. సినిమాల్లో ఎన్ని పాటలు పాడినా నేను ఎప్పుడూ ఒకర్ని అనుకరించే ప్రయత్నం మాత్రం చేయను. అలాగే నేను ఏ పాట పాడతున్నాననేది ఎప్పుడూ పట్టించుకోను. పాట అంటే పాటే. అది ఐటం సాంగా, డ్యూయెట్టా...ఇంకొకటా అనేది అనవసరం. ఏ పాట పాడినా అందులో ఒక ఆత్మ ఉంటుంది. కొంతమంది ఐటం సాంగ్‌ను చిన్నచూపు చూస్తుంటారు. ఐటం సాంగ్‌లోనూ సరిగమలుంటాయి. కొత్తగా వచ్చేవారికి చెప్పేది కూడా అదే. మనం సంగీత దర్శకుడికి నచ్చేలా పాడితే చాలు. ఎందుకంటే పాటకు ఆయన జన్మనిచ్చే తల్లి. గేయ రచయిత తండ్రి. వాళ్లిద్దరూ లేకుంటే పాటే లేదు, మనమూ లేము. కొత్తగా వచ్చిన సంగీత దర్శకుడికి ఏం తెలుసు అనే చిన్నచూపు ఏకోశానా వద్దు. సంగీతం అనంతమైంది, అపారమైంది, అందులో మనకు తెలిసింది ఒక బిందువు మాత్రమే.

పూలబాట కాదు
నేను సినిమా నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టినా నా ప్రయాణం పూలబాట మాత్రం కాదు. నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నదాన్నే, సమస్యలూ, ఒత్తిళ్లతో సతమతమైనదాన్నే. సినిమాల్లో పాడే అవకాశం, నటించే అవకాశాలూ పెద్దగా కష్టపడకుండానే వచ్చినా తరువాత విజయం అందుకోవడానికీ, ఈ రోజు నేనీ స్థాయిలో నిలబడటానికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను పాడాల్సిన పాట చివరిక్షణంలో ఎవరికో దక్కేది. ఒక దశలో పూర్తిగా అవకాశాలు లేక ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యేదాన్ని. అప్పుడే మలయాళంలో ఆసియానెట్‌ ఛానెల్‌ కొత్త గాయకులకు నిర్వహిస్తున్న 'స్టార్‌ సింగర్‌' రియాల్టీ షోలో పాల్గొన్నాను. అప్పటికే సినీ నేపథ్య గాయనిగా ఉన్న నేను రియాల్టీ షోలో పాల్గొనడం ఏంటీ అని పెదవి విరిచినవారూ ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా నేను ఆ పోటీలో పాల్గొని గెలిచాను. మలయాళంలో అది నాకెంతో గుర్తింపు తెచ్చింది. ఎన్నో అవకాశాలు పొందేలా చేసింది. ఆ రియాల్టీషో నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. నా జీవితంలో నేను ఎదుర్కొన్న మరో పెద్ద ఇబ్బందికర సమయం నా వివాహమే. పెళ్లయిన ఏడాదిలోపే మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. అది నన్ను మానసికంగా చిత్రవధ చేసిందనే చెప్పాలి. ఎంతగా కుమిలిపోయానంటే ఆత్మహత్య చేసుకుందామని రెండుసార్లు ప్రయత్నించేంతలా. కానీ తరువాత నేనే రియలైజ్‌ అయ్యాను. నేనేంటో నిరూపించుకోవాలి అనుకుని జీవితాన్ని ఒక సవాల్‌గా తీసుకున్నాను. నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఒంటరిగా ఎదుర్కోగల స్త్థెర్యం నా సొంతం. ఒకప్పుడు నేను బాగా లావుగా ఉండేదాన్ని. వివాహ బంధానికి బీటలు పడ్డాకే బరువు తగ్గడం కూడా ఒక సవాల్‌గా తీసుకుని ఇలా నాజూగ్గా తయారయ్యా.

టీచర్‌ను అవుతా
పాటల తరువాత నాకున్న పెద్ద వ్యాపకం 'టీచింగ్‌'. చెన్నైలోని సెయింట్‌ లూయిస్‌ కాలేజీలో మూగ, బధిర విద్యార్థులకు పాఠాలు చెబుతుంటాను. నేపథ్యగానం తరువాత టీచింగ్‌నే పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలనుకుంటున్నా. మూగ, బధిరులకు బోధించడానికి ప్రత్యేక కోర్సు చేస్తున్నా. రెండేళ్లలో అది పూర్తి అవుతుంది. మామూలు విద్యార్థులకు చదువు చెప్పడం చాలా సులభం. మూగ, బధిర విద్యార్థులకు బోధించడం మాత్రం ఒక పెద్ద సవాల్‌. ఒక సారి నేను యాధృచ్చికంగా ఆ కాలేజీకి వెళ్లి టీచర్‌గా మారాను. అక్కడ కొన్ని నెలల పాటు పనిచేశాను. నిజానికి బధిర విద్యార్థుల నుంచీ నేను ఎన్నో నేర్చుకున్నాను. అప్పటి వరకూ నాకు సంజ్ఞాభాష తెలీదు. వారితో నేను ఎలా మాట్లాడాలో విద్యార్థులే నాకు నేర్పారు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు 'తప్పకుండా మళ్లీ మాకు పాఠాలు చెప్పడానికి రావాలి' అని విద్యార్థులు నాతో ప్రామిస్‌ తీసుకున్నారు. వాళ్లతో నాకున్న అనుబంధం అలాంటిది. వాళ్లకోసమే నేనీ కోర్సు చేస్తున్నాను. చదువు కూడా నాకెంతో ఇష్టం. ఎంసీఏ పూర్తి చేసి, ఇప్పుడు ఎంఫిల్‌ చేస్తున్నాను. చిన్నప్పుడు స్కూల్‌కు నేనెప్పుడూ ఆబ్సెంటే. కానీ పరీక్షల్లో మాత్రం పాస్‌ అయ్యేదాన్ని. నేను ఎప్పుడు చదువుతున్నానో, ఎలా పాస్‌ అవుతున్నానో మా టీచర్లకు ఒక అంతుబట్టని మిస్టరీ. అలాగని నేనేమీ బెస్ట్‌ స్టూడెంట్‌ను కాదు, జస్ట్‌ యావరేజ్‌ అంతే.
రౌడీ పిల్లనే
నన్ను కొంత రౌడీపిల్లే అనొచ్చు. ఎవరైనా నా జోలికొస్తే ఎంతమాత్రం వూరుకునేదాన్ని కాదు. కాలేజీకి బస్సులోనే వెళ్లేదాన్ని. ఒకసారి ఒకబ్బాయి మమ్మల్ని టీజ్‌ చేస్తున్నాడు. కోపమొచ్చి వాణ్ణి బస్సులోనే చితక బాదేశాను. నా గురించి తెలిసిన అబ్బాయిలు నా జోలికి వచ్చేవారు కారు, కొడతానని భయం.

* చిన్నప్పుడు బిజీగా ఉండటం వల్ల నాపైన విపరీతమైన ఒత్తిడి ఉండేది. అది ఒత్తిడి అని కూడా నాకు తెలిసేది కాదు. దాన్నుంచి బయటపడటానికి విపరీతంగా తినేదాన్ని. రెండు మటన్‌ బిరియానీలు పెట్టినా లాగించేసేదాన్ని. అలా బాగా బరువు పెరిగాను.

* ఇప్పుడు నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కడుపు కట్టేసుకుని డైటింగ్‌ చేస్తున్నా. పళ్లరసాలు, చక్కెర, నూనె లేని మితాహారమే తీసుకుంటా. డైటింగ్‌ మొదలుపెట్టిన కొత్తలో నా ముందు ఎవరైనా తింటుంటే నోరూరేది. బలవంతంగా నన్ను నేను అదుపులో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు తిండి అంటే ఇంట్రెస్ట్‌ పోయింది.

* ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని నేను నాన్నగారూ అని పిలుస్తాను. ఆయన నా పట్ల అంతటి వాత్సల్యం చూపుతారు. చిన్నప్పటి నుంచీ నేను ఆయనకు తెలుసు. ఒక పాటను ఎలా అప్రోచ్‌ కావాలో ఆయన నుంచే నేర్చుకున్నాను.

* నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నా. సల్సా, ఫ్లెమింగో నృత్యాలూ ఇష్టం. సల్సా కొంచెం నేర్చుకున్నా. వీణ వాదనల్లో ప్రావీణ్యం ఉంది.

* సెంటిమెంట్లకు దూరం. జాతకాలు, సంఖ్యాశాస్త్రం ఇవేమీ నమ్మను. దేవుణ్ణి మాత్రం నమ్ముతాను. మనకు ఏం జరిగినా ఆయన కృపే.

* క్రైస్తవం స్వీకరించాను. అలాగని మిగిలిన మతాలపై విశ్వాసం లేదని కాదు. అన్ని మతగ్రంథాలూ చదువుతాను. ఖాళీ దొరికితే ఆధ్యాత్మిక పుస్తక పఠనమే నా కాలక్షేపం.

* నా చేతిపై మూడు పువ్వుల పచ్చబొట్టు కనిపిస్తుంటుంది. నమ్మకం, ప్రేమ, ఆశలకు సూచికలు. మధ్యలో ప్రేమ పుష్పం పెద్దదిగా ఉంటుంది. దానర్థం విశ్వాసం, ఆశ కంటే ప్రేమే గొప్పదని.

* సంగీతం నాకు ఎస్పీబాలు, సుశీలమ్మ, పీబీ శ్రీనివాస్‌, జేసుదాస్‌, చిత్ర, జానకమ్మ లాంటి గొప్పవాళ్లతో పరిచయం కల్పించింది. పీబీ శ్రీనివాస్‌ సంగీతంలో నాకెన్నో పాఠాలు నేర్పించారు.

* నేను మరచిపోలేని ప్రశంసలు ఎన్నని చెప్పగలను. ఇటీవలే ఈటీవీ 'స్వరాభిషేకం'లో 'శ్రీతుంబుర నారద నాదామృతం' పాట పాడాను. దాన్ని టీవీలో చూసిన సుశీలమ్మ చాలా బాగా పాడావు కల్పనా అంటూ మెసేజ్‌ పంపారు. దాన్ని నా ఫోన్‌లో స్క్రీన్‌ సేవ్‌ చేసి పెట్టుకున్నా. అంత పెద్దావిడ ఇచ్చిన ప్రశంస కంటే గొప్ప అవార్డు ఏముంటుంది చెప్పండి!

* మా అమ్మాయి ఇప్పుడు మూడో తరగతి చదువుతోంది. నా బలం, బలహీనతా, నా కూతురూ నా కుటుంబమే.

 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు : కల్పన రాఘవేంద్రర్  , 
  • నాన్న : టీఎస్‌ రాఘవేందర్‌ కర్ణాటక సంగీత విద్వాంసుడే కాకుండా సినీ సంగీత దర్శకుడు కూడాను. అమ్మ : సులోచన కూడా గాయనీమణే.,


నటించిన సినిమాలు (filmography ): 
  •  మలయాళంలో 'ఈనాడు' నా తొలిసినిమా. 
  • ఐదేళ్లు వచ్చాక కొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటించాను. 
  • బాలకృష్ణ నటించిన 'సీతారామకల్యాణం'లో నేను కనిపిస్తాను. 
 Courtesy with : Eeandu sunday edition 16-02-2014
  • ====================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala