Indu -ఇందు(TV.anchor)

  •  



పరిచయం (Introduction) :

  • కూతుర్ని బాగా చదివించాలని అమ్మానాన్నలు కలలు కంటే... తను మాత్రం చదువు మధ్యలోనే మానేసింది. యాంకర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశపడింది. అనుకున్నది సాధించింది. ఈటీవీ 'సఖి', టీవీ9 'స్వీట్‌ హోమ్‌' కార్యక్రమాలతో ప్రతిరోజూ మనల్ని పలకరిస్తున్న ఇందు చెప్పిన ముచ్చట్లు ఇవి.
  • నేను యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లవుతోంది. నిజానికి నేను ఈ రంగంలోకి వస్తాననుకోలేదు. చిన్నతనంలో టీవీ, సినిమాలతో అసలు సంబంధం ఉండేది కాదు. 

కెరీర్ :తన మాటల్లో->
మాది విశాఖపట్నంలో ఓ సంప్రదాయ కుటుంబం. నాన్న ఆర్టీసీ ఉద్యోగి. అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలం. మా అందర్నీ బాగా చదివించాలన్నదే నాన్న కోరిక. అక్కలందర్నీ సొంతూరులోనే చదివించినా క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతో నన్ను మాత్రం ఏలూరులోని సెయింట్‌ థెరిసా కాలేజీలో ఇంటర్‌ చదివించారు. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే చాలు... వ్యాఖ్యాతగా వ్యవహరించేదాన్ని. అలానే నా ఆటాపాటా ఉండి తీరాల్సిందే. చదువుకంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేదాన్ని. నాన్నకు మాత్రం అది ఇష్టం ఉండేది కాదు. దాంతో డిగ్రీ చదివేందుకు మళ్లీ వైజాగ్‌ వెళ్లిపోయాను. పేరుకు బీఎస్సీలో చేరానన్న మాటేగానీ, మనసు మాత్రం ఏదైనా చేయాలని పరితపించేది. నాన్న నాతోపాటు ముగ్గురు అక్కల్నీ చదివించే వారు. అందుకే ఆయన దగ్గర పాకెట్‌ మనీ కోసం చేయి చాచకూడదనుకున్నా. అప్పుడే లోకల్‌ టీవీలో యాంకర్‌గా అవకాశాలున్నాయని తెలిసింది. కాలేజీ ఫంక్షన్లలో చేసిన అనుభవం ఉంది కాబట్టి దరఖాస్తు చేశా. అమ్మానాన్నలేమో ఒప్పుకోలేదు. అక్కడ ఎలాంటి ఇబ్బందీ ఉండదని నచ్చజెప్పి ఒప్పించా. ఆ క్రమంలో యాంకరింగ్‌ మీద ఆసక్తి పెరిగింది. ఒక్కసారైనా శాటిలైట్‌ ఛానల్‌లో కనిపించాలనే కోరిక బలంగా కలిగింది. దాంతో డిగ్రీ మానేసి మరీ హైదరాబాద్‌ చేరుకున్నా.

ఆరొందల ఇంటర్వ్యూలు...
మాటీవీలో మొదటి అవకాశం వచ్చింది. యాంకర్‌ ఝాన్సీతో కలిసి 'బ్రెయిన్‌ ఆఫ్‌ ఆంధ్రా'... జీతెలుగులో మారుమూల గ్రామాలకు వెళ్లి అందరితో మాట్లాడే 'సకుటుంబ సపరివార సమేతంగా' రెండేళ్ల పాటు చేశాను. ప్రజలందర్నీ నేరుగా కలిసే కార్యక్రమం కావడంతో నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్లినా అంతా గుర్తుపట్టేవారు. తరవాత ఈటీవీలో 'మనోరంజని', 'సినీరంజని', 'సఖి', 'స్టార్‌తో సరదాగా', 'టాక్‌టైమ్‌'... మా టీవీలో 'అగ్గిపుల్ల సబ్బుబిళ్ల', 'కిట్టీపార్టీ' చేశాను. ప్రస్తుతం టీవీ9లో 'స్వీట్‌హోమ్‌', 'సఖి', సీవీఆర్‌ ఛానల్‌లో హెల్త్‌ కార్యక్రమాలు... కార్పొరేట్‌ ఈవెంట్లూ, సినిమా ఫంక్షన్లూ చేస్తున్నా. ఇప్పటి వరకూ నేను ఈటీవీలో ఆరొందల మంది సినిమా ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేశా. అన్ని ఛానళ్లలో కలిపి పన్నెండొందల వరకూ కుకరీ షోలు చేశా. నా అభిమాన నటుడు కమల్‌ హాసన్‌ని ఇంటర్వ్యూ చేయడం మాత్రం మంచి జ్ఞాపకం. 'నాన్‌స్టాప్‌' విడుదలైనప్పుడు, సుమన్‌ గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం ఆయన్ని మూడుసార్లు ఇంటర్వ్యూ చేశా. ఒకసారి ఆయన 'మీరు ప్రముఖుల ఇంటర్వ్యూలు బాగా చేస్తారు. మీరంటే మా అమ్మగారికి చాలా ఇష్టం' అని చెప్పారు. నా జీవితంలో అత్యంత విలువైన ప్రశంస అదే. అలానే ఈమధ్య గాయని అంజనా సౌమ్య ఓ అల్బమ్‌ విడుదల చేసినప్పుడు యాంకరింగ్‌ చేశా. బ్రహ్మానందంగారు అతిథిగా వచ్చారు. కార్యక్రమం పూర్తయి ఇంటికెళ్లాక ఫోన్‌ వచ్చింది. 'ఇందూ... నేనమ్మా బ్రహ్మానందాన్ని...' అన్నారు. అది నిజమో అబద్ధమో తేల్చుకోవడానికి కొన్ని సెకన్లు పట్టింది. కాసేపయ్యాక గొంతు నిర్ధారించుకొని మాట్లాడా. 'నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావ్‌. వింటుంటే వినాలనిపిస్తుంది' అని చెప్పారు. ఆ మాటలకు చెప్పలేనంత సంతోషం కలిగింది.

'సఖి' అంటారు...
నేను సినిమా ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలామందితో పరిచయం ఏర్పడింది. వాళ్లు చాలా సినిమాల్లో నటించమని అడిగారు. నేనే సున్నితంగా తిరస్కరించా. యాంకరింగ్‌ చేయడంలోనే నాకు ఆనందం ఉంది. నటన అంటే అంతగా ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళితే చాలు 'మీరు సఖి కదూ' అంటుంటారు. చాలామంది అలానే పిలుస్తుంటారు. మొదట్లో యాంకరింగ్‌కి వెళ్లొద్దన్న అమ్మానాన్నలు ఇప్పుడు నన్ను చూసి గర్వంగా ఫీలవుతారు. నాన్న కోసం అన్నామలై విశ్వవిద్యాలయంలో 'విజువల్‌ కమ్యూనికేషన్‌'లో పీజీ చేస్తున్నా. వచ్చే ఏడాది పూర్తవుతుంది. అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ యాంకరింగ్‌ చేయడం వల్ల బాధ్యతలు తెలిసొచ్చాయి. పొదుపుపై అవగాహన పెరిగింది. అలా పొదుపు చేసి సొంతంగా కారూ, ఇల్లూ కొనుక్కోగలిగా. ఈ రంగంలో స్థిరపడాలనేదే నా కోరిక.

జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : ఇందు , 
  • ఊరు : విశాఖపట్నం , 
  • నానా : ఆర్టీసి ఉద్యోగి , 
  • తోబుట్టువు : ముగ్గురు అక్కలు -- ఈమెతో నలుగురు .అందరి కంటే చిన్నది  .
  • చదువు : ఇంటర్ -  ఏలూరులోని సెయింట్‌ థెరిసా కాలేజీలో,బి.యస్.సి -వైజాగ్ లో ,


నటించిన సినిమాలు (filmography ): 
  • ఈటీవీలో 'మనోరంజని', 'సినీరంజని', 'సఖి' ,
  • స్టార్‌తో సరదాగా', 'టాక్‌టైమ్‌'
  • మా టీవీలో 'అగ్గిపుల్ల సబ్బుబిళ్ల', 'కిట్టీపార్టీ'
  • టీవీ9లో 'స్వీట్‌హోమ్‌', 'సఖి',
  • సీవీఆర్‌ ఛానల్‌లో హెల్త్‌ కార్యక్రమాలు.
 Source : courtesy with : Vasunda@Eenadu news paper
  • ===============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala