Friday, August 9, 2013

Gollapalli Nagabhushanam(bhushan)-గొల్లపల్లి నాగభూషణం (భూషణ్‌)


  •  
 Gollapalli Nagabhushanam(bhushan)-గొల్లపల్లి నాగభూషణం (భూషణ్‌)

--by Ravi kondararao@pathabangaram of eenadu cinema

కొందరు కొత్తగా పరిచయమవుతారు. ఆ పరిచయం మైత్రిగా మారి ఎంత దగ్గరయినా- మర్యాదగానే 'మీరు' అని పిలుచుకుంటూ మాట్లాడుకుంటారు. స్నేహం ఎక్కువయితే 'నువ్వు' అనుకునేవాళ్లూ ఉన్నారు. కాని, తొలి పరిచయంలోనే 'మీరు' అని, రెండో రోజునే 'నువ్వు' అనే వాళ్లలో భూషణ్‌ కనిపిస్తాడు. జి.ఎన్‌.భూషణ్‌ చిత్ర ప్రపంచంలో ఎందరికో మిత్రుడు. ఎందరో అతనికి మిత్రులు. స్నేహశీలి. ఫొటోగ్రఫీలో పేరుపొందినవాడు. సినిమా పబ్లిసిటీకి స్టిల్స్‌ ఉపయోగపడతాయి. ఆ స్టిల్స్‌ను అందంగానూ, వైవిధ్యంగానూ తీసి ఇవ్వగలవాళ్లు ఎందరో ఉన్నారు. ''స్టిల్‌ ఫొటోగ్రఫీ కూడా ఒక కళ. మామూలుగా ఫొటోలు తియ్యడంలాంటిది కాదు'' అని చెప్పే భూషణ్‌ ఫొటోగ్రఫీలో బాగా కృషి చేశాడు. ఆ కళకు సంబంధించిన విదేశీయ పుస్తకాలు పత్రికలూ అభ్యసించాడు. మద్రాసులో ఉన్న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఫొటోగ్రాఫర్‌ ఉద్యోగం చేశాడు.

మొదటిసారి బాపుగారింట్లో పరిచయమయ్యాడు నాకు. అప్పుడు ఉద్యోగంలో ఉంటూ, పత్రికలకు ఫొటోలు తీసేవాడు. సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లంటే ఇష్టపడే బాపుగారు భూషణ్‌ని మెచ్చుకునేవారు. ''ఏఁవయ్యా బాపూ... నువ్వు'' అని మాట్లాడుతూ ఉంటే ''మీకు బాల్యమిత్రుడా?'' అని అడిగితే ''అబ్బే- అదేం లేదు. ఇక్కడే పరిచయం'' అన్నారు బాపు. రమణగార్నీ అంతే. అయితే, వాళ్లిద్దరూ తిరిగి అతన్ని నువ్వుగా మాట్లాడ్డం వినలేదు. అలా ఆప్యాయంగా దగ్గరైపోయేవాడు భూషణ్‌. రెండో పరిచయంలో నేను నువ్వుగా మారితే, అతనూ నాకు నువ్వు అయిపోయాడు!

లావుగా ఎత్తుగా అంత మనిషి. కెమెరా ఎప్పుడూ భుజం మీద ఉంటుంది. 'కెమెరా భూషణా' అనీ, 'ఫోటోత్కచుడూ' అని పిలిచేవాడిని.

గొల్లపల్లి నాగభూషణం పూర్తి పేరుగల భూషణ్‌కి చిన్నప్పుడే ఫొటోలు తియ్యడం మీద ఉత్సాహం పుట్టి- 1948లో 7 రూపాయలు పెట్టి ఓ కెమెరా కొని బొమ్మలు తీసినవాడు- 1980 వచ్చేసరికి లక్షా యాభై వేల రూపాయల కెమెరాకి పెరిగాడు. మద్రాసులోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూనే బయటి ఫొటోలు తీస్తూ పత్రికలకు ఇచ్చేవాడు. 1951లో మద్రాసు చేరుకున్న వైనం సినిమాల్లో చేరి అందమైన బొమ్మలు తియ్యాలని, సినిమా ఉత్సవాలకి వెళ్లి తీసిన ఫొటోలు ఆకర్షించాయి. అక్కినేని నాగేశ్వరరావుగారికి సన్నిహితుడయ్యాడు. ఆయన్ని, ఆయన కుటుంబాన్నీ వీలైనన్నిసార్లు బొమ్మలు తీసి అక్కినేని వారి మెప్పు పొందాడు. సినిమాల్లో కాకుండా, ఇవాళ మనం చూసే అక్కినేని వారి ఛాయాచిత్రాల్లోని చాలా చిత్రాలు భూషణ్‌ తీసినవే. నాగేశ్వరరావు గారి పుస్తకం 'మనసులోని మాట' అట్టమీద బాపుగారు వేసిన స్కెచ్‌ ఉంటుంది. ఆ స్కెచ్‌కి మూలం- భూషణ్‌ ఫొటో. డి.వి.యస్‌. రాజుగారి 'మంగమ్మ శపథం' (1965) భూషణ్‌ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా చేసిన తొలి చిత్రం. అతను తీసిన స్టిల్స్‌ బాగున్నాయని రామారావుగారు ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత అఫీషియల్‌ ఫొటోగ్రాఫర్‌ భూషణే. ఆయన తీసిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రం వరకూ ఆ పనీ చేశాడు.

బాపు రమణల 'సాక్షి' (1967) నుంచి వాళ్ల చిత్రాలకు పనిచేశాడు. 'సాక్షి'లో చెప్పుకోదగ్గ వేషం కూడా వేశాడు. హేమమాలిని, కాంచన, జమున వంటి వారి ఆరంభ కాలంలో ఎన్నో ఫొటోలు తీశాడు. హేమమాలిని సినిమా ప్రవేశానికి భూషణ్‌ ఫొటో ఆల్బమే- ఆలంబన.
భూషణ్‌, మైక్‌ రామారావు, గౌతమ్‌ ముగ్గురూ కలిసి కల్పనా ఎంటర్‌ప్రైజెస్‌ అని పబ్లిసిటీ సంస్థ నడిపారు- పెద్ద ఆఫీసు తీసుకుని, నేను 100 చిత్రాలు పూర్తి చేసుకున్నప్పుడు పత్రికల వారిని, కొందరు పెద్దల్నీ ఆహ్వానించి కృతజ్ఞతాసభ పెట్టాను. ఆ బాధ్యతంతా భూషణ్‌కి అప్పచెప్పాను. ఎన్ని ఫొటోలు తీసి ఇచ్చాడో! ''నీకు ఎంత ఖర్చయిందయ్యా?'' అని అడిగితే, ''నువ్వు ఎంత ఇస్తే అంత'' అన్నాడు. అలా ఔదార్యమూ చూపిస్తాడు; ఒక్కోసారి ''ఇంత'' అయితేగాని, బొమ్మలు తియ్యను అని బయటవాళ్ల దగ్గర కచ్చితంగానూ ఉంటాడు. చిరుతిళ్లు ఇష్టపడేవాడు. మరమరాలు, బటానీలు, వేరుసెనగ్గింజలూ- అన్నీ పొట్లాలతో తెచ్చి తక్కినవి కొన్ని అడిగి, ఏవో చేస్తాడు- 'ముంత కింది పప్పు'లా. బాదం, పిస్తాల్లాంటివీ తెచ్చేవాడు. సేలం మాడర్న్‌ థియేటర్స్‌ వారు 'మొనగాళ్లకి మొనగాడు' (1966) తీశారు. దానికి భూషణ్‌ పనిచేశాడు. అందులో నేను వేశాను. షూటింగ్‌ కాలంలో సాయంకాలం అవి ఇవీ తెచ్చి ముంతకింద పప్పు లాంటిది తయారుచేసి, దాని సంగతి తెలియని అక్కడి వాళ్లకి పంచిపెట్టాడు, నేర్పాడు. తనకి అత్యంత ప్రియమైనవాడు ఎవరంటే- 'బాపు' అని చెప్పేవాడు.

హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్లాను. ''వేలాది నెగెటివ్‌లున్నాయి. కొన్ని ప్రింట్లూ ఉన్నాయి. అన్నీ భద్రంగా ఉన్నాయి. ఎవరికైనా అవసరం అయితే చెప్పు ఇచ్చేస్తాను. లక్ష రూపాయలిమ్మను. నాకు పనికొస్తుంది'' అన్నాడు. మొహమాటం, నిర్మొహమాటం రెండూ ఉన్న వాళ్లు తక్కువ. ఆ తక్కువ వాళ్లలో ఒకడు భూషణే. నాకు తెలిసిన దగ్గర్నుంచీ ధూమపానీయుడు. సిగరెట్లు తెగ వూదేవాడు. బహుశా, అవే అతన్ని అంత్యఘట్టానికి తీసుకెళ్లాయి. ''సహస్రాధిక చంద్ర దర్శనోత్సవం'' పేరిట 2011లో రవీంద్రభారతిలో అతని ఫొటో ఎగ్జిబిషన్‌ పెట్టి, ముఖీ మీడియా వారు అద్భుతంగా నిర్వహించారు. ఆ సందర్భానికి ముందు, నేను భూషణ్‌తో ఫోన్‌లో మాట్లాడాలనుకుంటే మాట్లాడలేకపోయాడు. ఎవరో మాట్లాడి, అతని మాట నాకు చెప్పారు.
భూషణ్‌కి పెళ్లిలేదు. ఒంటరివాడు. అయినా, అలా అనిపించుకోలేదు. సన్నిహితులు, మిత్రులూ అభిమానులూ ఎందరో! 'విజయచిత్ర' ఆరంభించినప్పుడు కలర్‌ స్టిల్స్‌ భక్త తీస్తున్నా, సెట్స్‌ మీద నలుపు తెలుపు బొమ్మలు తియ్యడానికి ''నువ్వు ఆ పని చేసి ఇస్తావా'' అని అడిగితే ''నా వృత్తే అదయ్యా బాబూ'' అన్నాడు. విశ్వనాథరెడ్డిగారు ఆమోదించారు. ఒక ఫొటోకి పది రూపాయలు. కొన్నాళ్లయిన తర్వాత- ''చాలదు. 15కి పెంచండి'' అన్నాడు. పెంచేవారేమో కాని, అప్పటికే నెలజీతానికి ఒకడున్నాడని అతన్ని పంపడం జరిగింది. 'విజయచిత్ర'లో వచ్చిన చాలా వర్కింగ్‌ స్టిల్స్‌- కొత్తగా ఉండి ఆకర్షించాయి. ఇవాళ చాలామంది కాపీ చేసి తమ పుస్తకాల్లో ముద్రిస్తున్న వాటిలో భూషణ్‌ బొమ్మలే ఎక్కువ. దర్శకులు, నిర్మాతలు, నటులు ఎందరో.

సినిమా షూటింగ్‌లో షాటు పూర్తికాగానే స్టిల్స్‌ తీస్తారు- అదే కోణం, లైటింగ్‌లో. భూషణ్‌ మాత్రం తీసే ముందు లైట్లు మార్చేవాడు. కెమెరామన్‌ ఏమనుకుంటాడో అని- ''స్టిల్‌ లైటింగ్‌ సార్‌'' అనేవాడు.

అయితే ఎక్కువ చిత్రాలకు అతగాడు పనిచెయ్యలేదు. ఎందుకంటే షూటింగ్‌ ఉన్నన్నాళ్లూ రోజూ షూటింగ్‌ మొదలయిన దగ్గర్నుంచి, 'పాకప్‌' వరకూ ఉండాలి. అతనికి కిట్టేది కాదు. ''ముఖ్యమైన దృశ్యాలు ఉన్నప్పుడు చెప్పండి. రోజూ ఎందుకు?'' అని అడిగితే ఒప్పుకోని వాళ్లే ఎక్కువ.
ఆదుర్తిగారు 'విశాలనేత్రాలు' నవల చిత్రంగా తియ్యాలనుకున్నప్పుడు, భూషణ్‌ హేమమాలిని ఫొటోలు చూపిస్తే ఆయన మురిసిపోయి- ''పిలవండి- మాట్లాడతాను'' అన్నారు. తీరా హేమమాలిని వచ్చాక ఆయనకు నచ్చలేదు. ''ఫొటోలు తీసి మోసం చేశావయ్యా భూషణ్‌'' అన్నారు. అందులో మెచ్చుకోలూ ఉంది, మెచ్చుకోకపోవడమూ ఉంది.

వేళ్ల మధ్య సిగరెట్‌ బిగించి, నోటితో పొగలాగుతున్న శ్రీశ్రీగారి 'ప్రొఫైల్‌' తరచు కనిపిస్తుంది. అలాగే మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది; ఆలోచనలో ఉన్న బి.ఎన్‌.రెడ్డి, నవ్వుతున్న ఆరుద్ర, నాట్యవిన్యాసంలో వెంపటి సత్యం, ఈశ్వర్‌ కలర్‌లో వేసిన సావిత్రి క్లోజప్‌, నవ్వుతున్న ఆత్రేయ క్లోజప్‌- ఇలాంటివెన్నో తరచు పుస్తకాల్లోనూ, పత్రికల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ భూషణ్‌ కెమెరాలోంచి వచ్చినవే. ఇలాంటివి ఇంకా ఎన్నో 'సజీవమైన' నిశ్చల చిత్రాల్ని మనకి వదిలి- తాను సజీవుడైనాడు భూషణ్‌
  • =====================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog